ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం ప్రారంభమైంది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా రూ.7,500 ఖాతాలో జమ కానున్నాయి. పథకం ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకానికి శ్రీకారం చుట్టడం బాధగా ఉందన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసాను ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. సాధారణ పరిస్థితులు ఉంటే రైతులతో కలిసి భారీ సభలో ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్లమని సీఎం అన్నారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎంత చేసినా తక్కువే అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదని, పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా కింద రూ.13500 ఏటా అందిస్తున్నాని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 12500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా.. రూ.13,500 చొప్పున ఐదేళ్లపాటు ఇస్తామని ప్రకటించారు.
గతేడాది రూ.6350 కోట్లు రైతు భరోసా కింద చెల్లించామని, రైతు భరోసా కింద రూ.5500 నగదు రైతుల అకౌంట్‌లో జమ అవుతాయన్నారు. కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేస్తున్నవారికి రూ.7500 అందజేస్తామన్నారు. అక్టోబర్‌లో రూ. 4 వేలు, వచ్చే సంక్రాంతికి మరో రూ.2 వేలు అందజేస్తామన్నారు. గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నట్లు చెప్పారు. ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేయించుకునే అవకాశం కల్పించామన్నారు. రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని, నగదు బదిలీ కాకుంటే 1902 కాల్ సెంటర్‌కు రైతులు ఫోన్ చేయొచ్చు అని తెలిపారు. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, మే 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు.