https://oktelugu.com/

AP Pension Hike: పించన్ 3వేలు పెంచిన జగన్ సర్కార్.. వచ్చే ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందా?

2019 ఎన్నికల నాటికి సామాజిక పింఛన్లు రూ.1000 చొప్పున అందించేవారు. తాను గెలిస్తే రూ.2 వేలకు పెంచుతానని చంద్రబాబు ప్రకటించారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 1, 2024 / 01:24 PM IST
    Follow us on

    AP Pension Hike: ఏపీవ్యాప్తంగా ఈరోజు నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. రూ.250 పెంచుతూ పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పెంచిన మొత్తాన్ని ఈ నెల నుంచి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కూడా ప్రారంభమైంది. వైసిపి అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఏడాదికి రూ.250 పెంచుతూ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని రూ.3 వేలకు తీసుకెళ్లి ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. పింఛన్ లబ్ధిదారుల అభిప్రాయంతో ప్రత్యేక వీడియోలను రూపొందించి ట్రోల్ చేస్తోంది.

    2019 ఎన్నికల నాటికి సామాజిక పింఛన్లు రూ.1000 చొప్పున అందించేవారు. తాను గెలిస్తే రూ.2 వేలకు పెంచుతానని చంద్రబాబు ప్రకటించారు. అయితే నాడు పాదయాత్ర చేసి నవరత్నాలను రూపొందించిన జగన్ మాత్రం ఏకంగా పింఛన్ మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతానని స్పష్టం చేశారు. ప్రజలు జగన్ మాటనే నమ్మారు. వైసీపీని ఆదరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పింఛన్ మొత్తాన్ని 2250 రూపాయలకు పెంచారు. ఆ తరువాత సంవత్సరం 2500 కు పెంచారు. గత ఏడాది 2750 చేశారు. ఈ ఏడాది మూడు వేలు చేసి అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల నుంచి పంపిణీని ప్రారంభించారు.

    ఈ ఏడాదిలో ఎన్నికలు ఉండడంతో దీనిని ఒక ప్రచార అస్త్రంగా వాడుకోవాలని వైసిపి భావిస్తోంది. జనవరి 1 నుంచి 8 రోజులు పాటు పెన్షన్ల పెంపు ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా ప్రతినిధులు ఈ 8 రోజులు పాటు ఉత్సవాల్లో పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో ఈనెల 3న జరిగే వేడుకల్లో సీఎం జగన్ పాల్గొంటారు. కాగా పెన్షన్ల పెంపు పై వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది. పండు టాకులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఏ ఆదరణ లేని మహిళల వాయిస్ తో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నేటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి.