YSR Kalyanamasthu and Shadi Thofa: జగన్ దాదాపు నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరో 16 నెలల్లో ఎన్నికలకు వెళ్లనున్నారు. అయితే ఇన్నాళ్లూ నవరత్నాలకే ప్రధాన్యమిచ్చిన సీఎం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో పెండింగ్ పథకాలు పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అటు నవరత్నాలతో పాటు పథకాలు కూడా అమలుచేసినట్టు చెబుతూ ఎన్నికలకు వెళ్ల,నున్నారు.గత ప్రభుత్వాలు అమలుచేసిన చాలావరకూ పథకాలకు జగన్ అధికారంలోకి రాగానే మంగళం పలికారు. కేవలం నగదు బదిలీ పథకాలకే పరిమితమయ్యారన్న అపవాదును మూటగట్టుకున్నారు. అందుకే పెండింగ్ పథకాలకు పేరు మార్చి అమలుకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా ‘వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా’ పథకాన్ని అక్టోబరు 1 నుంచి అమలు చేయనున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం వెల్లడించారు.
అయితే పథకంలో కొత్త నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టే అవకాశముంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ పథకం వర్తించేది. కానీ జగన్ సర్కారు మాత్రం వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలనే మెలిక పెట్టింది. ఆ కుటుంబం 300 యూనిట్లు కంటే అధికంగా విద్యుత్ వినియోగించినా పథకానికి అనర్హులుగా ప్రకటించింది. కుటుంబసభ్యలకు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నా పథకం వర్తించదు. అయితే ఇన్ని నిబంధనల నడుమ పథకం అమలుచేయడంపై ప్రజలు పెదవివిరుస్తున్నారు. పథకం ఆలస్యంగా ప్రారంభించి ఇన్ని ఆంక్షలు విధించడం తగునా అని ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులైతే రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు, మైనార్టీలకు రూ.లక్ష, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికుల వివాహానికి రూ.40 వేలు అందజేయనుంది. శనివారం నుంచి పథకం అమలులోకి రానుంది. సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ,ఇందుకు సంబంధించి వెబ్ సైట్ ను శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
అయితే గత మూడేళ్లుగా వివాహం చేసుకున్న వారి పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. కళ్యాణమస్తు సాయం కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలా? లేకుంటే కేవలం కొత్త వారికేనన్న విషయంలో ప్రభుత్వం ఎటువంటి స్పష్టతనివ్వడం లేదు. అటు అధికారులను అడుగుతుంటే ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు లేవని తప్పించుకుంటున్నారు. పథకానికి కఠిన ఆంక్షలు చూస్తుంటే పెండింగ్ దరఖాస్తులను పక్కన పడేసినట్టేనన్న టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది.