
AP Electricity Charges: బాదుడే..బాదుడు..ఈ మాట గుర్తింది కదూ.. ఏపీ సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు రీ సౌండ్ చేస్తూ ప్రజలకు చెప్పిన మాట ఇది. ఊరూవాడ ఇదే మాటను వల్లె వేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులను ఉదహరిస్తూ ఈ మాటనే విచ్చలవిడిగా వాడేశారు. టీడీపీ గవర్నమెంట్ చార్జీలు పెంచుకుంటూ పోతోందని.. పన్నులు పెంచుతోందని ఆరోపిస్తూ ‘బాదుడే బాదుడు’ అన్న కామెంట్ కు బహుళ ప్రాచుర్యం కల్పించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం పన్నులు, చార్జీలు తగ్గిస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక అవేవీ జరగలేదు సరికదా.. ఆ బాదుడు మరింత తీవ్రమైంది. దీంతో నాడు జగన్ వాడిన బాదుడే బాదుడు కామెంట్ ఇప్పుడు ప్రతిబంధకంగా మారింది. ఏకంగా టీడీపీ పాలనా వైఫల్యాలపై ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. అయితే ఇవేవీ లెక్కలు తీసుకొని జగన్ తనకు అలవాటుగా మారిన చార్జీల పెంపుకే మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచేశారు.
ట్రూఆఫ్ చార్జీల పేరిట..
విద్యుత్ చార్జీల పెంపునకు వైసీపీ సర్కారు దొడ్డిదారిని ఎంచుకుంది. ట్రూఆఫ్ చార్జీల పేరు పెట్టి వసూలు చేస్తోంది. ప్రతీ నెలా ఒక్కో యూనిట్ కు నలభై పైసలు వడ్డించేందుకు అనుమతి లభించింది. ఇది సామాన్య ప్రజలకు అత్యంత భారంగా మారనుంది. ఈ ట్రూ అప్ చార్జీలు బయట నుంచి కరెంట్ కొనుగోలు చేయడం వల్ల పడిన భారానికి వసూలు చేసేవి. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ముందు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసింది. కరెంట్ కొనడం మానేసింది. ఒప్పందాల ప్రకారం వారికి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. దీంతో అవసరాల కోసం కరెంట్ ను బయట నుంచి యూనిట్ కు రూ.20 కూడా పెట్టి కొనాల్సి వచ్చింది. ఇప్పుడు వాటినే ప్రజల వద్ద నుంచి పిండేస్తున్నారు. దానికి అందంగా ట్రూఆఫ్ చార్జీలు అన్న నామకరణం చేశారు.
మాటిచ్చారు.. మాట తప్పారు…
సరిగ్గా నాలుగేళ్ల కిందట సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. అప్పట్లో ఎంతో బిగ్గరగా మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ ల సాక్షిగా అసలు విద్యుత్ చార్జీలే పెంచనని తేల్చిచెప్పారు. అంతటితో ఆగకుండా గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తానని.. అవసరమైతే చార్జీలను తగ్గిస్తానని కూడా హామీ ఇచ్చారు. మాట తప్పడు.. మడమ తిప్పడు అన్న పేరు ఉండడంతో ప్రజలు కూడా ఇట్టే నమ్మేశారు. కానీ కాలగర్భంలో నాలుగేళ్లు కరిగిపోయేసరికి ప్రజలకు తత్వం బోధపడింది. ఆయన చెప్పిన మాటలకు చెబుతున్న పనులకు పొంతన లేదు. అప్పట్లో విద్యుత్ చార్జీలను పెంచని చెప్పారే కానీ.. ట్రూఆఫ్ పేరిట సర్దుబాటు చేస్తానని చెప్పలేదు కదా అని సర్దిచెబుతున్నారు. ఏడుసార్లు చార్జీలు పెంచగా.. ఇప్పుడు ప్రతినెలా ట్రూఆఫ్ చార్జీల పేరిట వడ్డించేస్తున్నారు.

ఇస్తున్నదెంత? తీసుకున్నదెంత?
ప్రభుత్వం సంక్షేమం పేరిట ఇస్తోంది పది, ఇరవై మందికి. కానీ తీసుకుంటోంది వంద శాతం మంది నుంచి. ఏ మాత్రం ముందుచూపు లేకుండా సాగిస్తున్న పాలనకు రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీ. విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్న రాష్ట్రం ఏపీ, గతుకులమయమైన దరిద్రపు రోడ్డు ఉన్నది మనదే. ఇలా ఏ గణాంకం తీసుకున్నా అధమ స్థానంలో నిలిచింది ఏపీ. అలా అనేదానికంటే తన పాలనతో జగన్ అట్టడుగున నింపారు. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు వెనక్కి పంపించారు. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఇబ్బందులకు అలవాటు పడాలి. ఇప్పుడు ప్రతినెల ఠంచనుగా వచ్చే విద్యుత్ చార్జీల రూపంలో షాక్ కు సైతం అలవాటు పడాల్సిందే.