తెలంగాణ రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది వైఎస్ షర్మిల. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇప్పటికే అన్ని జిల్లాల వైఎస్సార్ అభిమానులతో సమావేశం అయ్యారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తానంటూ బహిరంగ సభలో ప్రకటించారు. ఖమ్మం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలోనూ ఆమె అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే.. తెలంగాణ గడ్డపై షర్మిల గెలుపు అంత ఈజీ కాదని రాజకీయ నిపుణులు అంటున్నారు.
తనకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని.. తెలంగాణ మెట్టినిల్లు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే.. మెట్టినిల్లు అంటూ పెద్ద ఎత్తున సెంటిమెంట్ తీసుకురావాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ.. వాటిని తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరనేది వాస్తవం. అంతేకాదు.. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు.. నిన్నటివరకు ఉద్యోగ దీక్ష అంటూ చేపట్టిన దీక్షకు కూడా పెద్దగా మైలేజ్ వచ్చినట్లుగా అనిపించలేదు. ఇందిరా పార్క్ వేదికగా చేపట్టిన దీక్షకు పోలీసులు పూర్తిస్థాయిలో పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్క రోజు మాత్రమే అనుమతించారు. దీంతో ఆమె సాయంత్రమే దీక్షను ముగించాల్సి ఉన్నా.. నానా హంగామా చేశారు. లోటస్‌పాండ్‌కు కాలినడకన బయలుదేరడంతో ఆమెను మార్గమధ్యలోనే అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే.. దీనిపై కొన్ని చానల్స్ మాత్రం నానా హంగామా చేశాయి. వాటికి టీఆర్పీలు కావాలి కాబట్టి అంత హైప్ తెచ్చాయని బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. కానీ.. ఎక్కడా ఆమెకు ప్రజాదరణ పెద్దగా కనిపించినట్లుగా అనిపించలేదు. తెలంగాణ ప్రజలు షర్మిలను పెద్దగా లెక్కల్లోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే.. ఆమెను దీక్షను సైతం ఎవరూ పెద్దగా లెక్క చేయలేదు.
మరోవైపు.. షర్మిల పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని భారీగానే ప్రచారం నడిచింది. ఆ పార్టీలోని సీనియర్ నేతలంతా షర్మిల వైపు వెళ్తారని అన్నారు. ఏ పార్టీ అయినా సక్సెస్ కావాలంటే కార్యకర్తలు ఉండాలి. క్యాడర్ కూడా ఉండాలి. కానీ.. షర్మిల వైపు నుంచి చూస్తే అలాంటి క్యాడర్ ఏమీ కనిపించడంలేదు. ఇప్పటికిప్పుడు క్యాడర్ జమ అవుతుందా అనేది లేదు. ప్రస్తుతం షర్మిల పార్టీలో ఏదో ఒక నలుగురు వచ్చి నానా హంగామా చేస్తున్నారు. ఆ మాత్రాన ఆమె అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతారా..? తెలంగాణలో ఆమె పార్టీకి భవిష్యత్ ఎంత వరకు ఉంటుంది..? అనేది చూడాలి.