YS Sharmila- Pawan Kalyan: ఆంధ్రాలో అన్నతో విభేదించి.. తెలంగాణలో రాజకీయంగా ఎదగాలని ఆశిస్తున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ముద్దుల తనయ వైఎస్.షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు. దాదాపు ఏడాదిగా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆమె పాదయాత్రకు పెద్దగా స్పందన లేకపోయినా.. సంచలన ఆరోపణలు, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు చివరికి సీఎం కేసీఆర్ అవినీతిని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో ప్రజలను కలుస్తున్నట్లు, చేలల్లో పనులు చేస్తున్నట్లు, కూలీలతో కలిసి భోజనం చేస్తున్నట్లు.. ఫొటోలకు ఫోజులు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. సుమారు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెబుతున్నారు. అయినా యాత్రకు పెద్దగా స్పందన ఉండడం లేదు. షర్మిల పాదయాత్ర ఆపడం లేదు.

పవన్‌ను కలిసినట్లు ప్రచారం..
తెలంగాణపైనే ప్రస్తుతం షర్మిల ఫోకస్ పెట్టారు. ఆంధ్రాను అన్న జగన్‌కే వదిలేసినట్లు కనిపిస్తోంది. అయితే ఆంధ్రాలో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని రాజకీయంగా దూకుడు పెంచిన జన సేనాని పవన్‌కళ్యాణ్.. జగన్ సర్కార్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ప్రతిపక్షాలను కలుపుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల జనసేనానిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఇరు పార్టీలు ప్రకటించకపోయినా.. రహస్యంగా ఇద్దరు కలిసి రాజకీయాలపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
వైఎస్సార్ టీపీని స్వాగతించిన పవన్..
తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ కొత్త పార్టీ(వైఎస్‌ఆర్ తెలంగాణ) పెట్టబోతున్నట్టు వైఎస్.షర్మిల ప్రకటించగానే పవన్ స్పందించారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని అన్నారు. కొత్త వాళ్లు రావాలని తాను కోరుకుంటానని పవన్ చెప్పారు. పార్టీ విధివిధానాలు వచ్చాక మాట్లాడతానని చెప్పారు. ఆ తర్వాత పవన్ షర్మిల పార్టీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. తాజాగా షర్మిల, పవన్ మీటింగ్ ప్రచారం అటు ఏపీలో, ఇటు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.
కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చి పవన్ ఫ్యాన్స్‌ను కుషీ చేసిన షర్మిల..
మరోవైపు వైఎస్.షర్మిల గతంలో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు కంటే జనసేన అభిమానులు ఎక్కువగా కుషీ చేసింది. కేటీఆర్ షర్మిలపై చేసిన వ్యాఖ్యలను ప్రెస్‌మీట్‌లో మీడియా ప్రతినిధి గుర్తుచేశారు. అందుకు సమాధానం ఇస్తూ వ్యంగ్యంగా ‘‘కేటీఆర్ అంటే ఎవరు?’’ అని ప్రశ్నించింది. పార్టీ సభ్యులతో కూడా కేటీఆర్ అంటే ఎవరు అని ప్రశ్నిస్తూ కొంతసేపు టీఆర్‌ఎస్ మంత్రిని హేళన చేసింది. ఆ తర్వాత ‘‘ఓహో కేసీఆర్ కుుమారుడా కేటీఆర్ అంటేం’’ అని మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ వారికి మహిళలంటే ఎటువంటి గౌరవం లేదని అలాంటి వారి మాటలు మేము పట్టించుకోము అని చెప్పడం గమనార్హం. గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పుడు కేటీఆర్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు చిరంజీవి తమ్ముడు అంటూ అతను కూడా ఇలాగే ఎగతాళి చేసినట్టు మాట్లాడాడు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు అన్న ఒకసారి, తమ్ముడు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి వెళుతుంటారు అని వీరంతా ఇక్కడ సీరియస్‌గా నిలిచే నేతలు కాదని కేసీఆర్ మాట్లాడడం వివాదాస్పదం అయింది. ఇప్పుడు షర్మిల ‘‘కేసీఆర్ కొడుకు కేటీఆర్’’ కు ట్రీట్మెంట్ ఇవ్వడంతో జనసేన అభిమానులు బాగా సంతోషపడిపోతున్నారు.

షర్మిల, పవన్ మీటింగ్ నిజమేనా..
గతంలో పరోక్షంగా ఒకరికి ఒకరు మద్దతుగా నిలిచిన పవన్, షర్మిల తాజాగా మీట్ అయినట్లు వస్తున్న వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇంత వరకు ఇరు పార్టీల నేతలు ఎన్నడూ నేరుగా విమర్శించుకున్న దాఖలాలు లేవు. కలిసిన సంరద్భమూ లేదు. పవన్ ఆధ్రాపై ఫోకస్ పెడితే.. షర్మిల తెలంగాణపై దృష్టిపెట్టారు. రెండు రాష్ట్రాల్లో కీలకంగా ఎదగాలని భావిస్తున్న ఇద్దరు నేతలు ఎందుకు కలిశారు, కలిస్తే ఏం మాట్లాడారు.. భవిష్యత్ రాజకీయాలపై వీరి ప్రభావం ఎలా ఉంటుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై చర్చించి ఉంటే షర్మిల ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది నిజమైనే పవన్‌కు పెద్ద బలం దొరుకుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.