YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన వైఎస్ షర్మిల జనసేన అధినేత పవన్ ను కలుసుకున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరుకావాలని పవన్ ను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా వారి మధ్య కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. నూతన జంట వివరాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం అయిన సంగతి తెలిసిందే. అందుకే ఆమెకు ప్రత్యేక పుష్పగుచ్చం అందించి పవన్ అభినందనలు తెలిపారు.
షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో జరగనున్న సంగతి తెలిసిందే. జనవరి 18న హైదరాబాదులోని గండిపేట లో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో వివాహ నిశ్చితార్థం వేడుకలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుకలకు షర్మిల భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే సోదరుడు, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గవర్నర్ తమిళసై, మాజీ మంత్రి హరీష్ రావు, నారా లోకేష్ తదితరులకు షర్మిల ఆహ్వాన పత్రికలు అందించారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కు అందజేశారు.
నేడు జరిగే నిశ్చితార్థ వేడుకలకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా సోదరుడు జగన్ తో షర్మిలకు వివాదాలు నడుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణలో పార్టీ ఏర్పాటు జగన్ కు ఇష్టం లేదని టాక్ నడిచింది. అక్కడ రాజకీయంగా వర్కౌట్ కాకపోవడంతో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పగ్గాలు అందుకోనున్నారు. సోదరుడికి వ్యతిరేకంగా రాజకీయాలు చేయనున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల ఇంట శుభకార్యం జరగడం, సోదరుడికి ఆహ్వానం అందడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు నిశ్చితార్థ వేడుకలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.