వైఎస్ ఫొటో పంచాయితీ.. దాని బ‌ల‌మెంత‌?

రాజకీయం ఎప్పుడు ఎవ‌రిని వాడేద్దామా? అని చూస్తుంది. మేలు జ‌రుగుతుందంటే.. ప‌రాయి వాడిని సైతం ముద్దు చేస్తుంది. అవ‌స‌రం లేద‌నుకుంటే.. సొంత‌వాడిని కూడా విసిరిపారేస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ వైఎస్సార్ పేరు వినిపిస్తోంది. నిన్న‌టికి నిన్న కొత్త‌గా పార్టీ పెట్టిన వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కూతురు ష‌ర్మిల‌.. త‌న తండ్రి పాల‌న‌ను మ‌ళ్లీ అందించ‌డ‌మే ల‌క్ష్యం అని చెప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తండ్రి ఫొటో పెట్టుకొనే ఓట్లు అడుగుతార‌న్న‌ది తెలిసిందే. త‌న తండ్రిగా ఆయ‌న పేరు […]

Written By: Bhaskar, Updated On : July 9, 2021 4:59 pm
Follow us on

రాజకీయం ఎప్పుడు ఎవ‌రిని వాడేద్దామా? అని చూస్తుంది. మేలు జ‌రుగుతుందంటే.. ప‌రాయి వాడిని సైతం ముద్దు చేస్తుంది. అవ‌స‌రం లేద‌నుకుంటే.. సొంత‌వాడిని కూడా విసిరిపారేస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ వైఎస్సార్ పేరు వినిపిస్తోంది. నిన్న‌టికి నిన్న కొత్త‌గా పార్టీ పెట్టిన వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కూతురు ష‌ర్మిల‌.. త‌న తండ్రి పాల‌న‌ను మ‌ళ్లీ అందించ‌డ‌మే ల‌క్ష్యం అని చెప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తండ్రి ఫొటో పెట్టుకొనే ఓట్లు అడుగుతార‌న్న‌ది తెలిసిందే. త‌న తండ్రిగా ఆయ‌న పేరు వాడుకునే హ‌క్కు త‌న‌దే అన్న‌ది ఆమె వాద‌న‌.

ఇటు కాంగ్రెస్ కూడా వైఎస్ జ‌యంతిని జ‌రుపుకుంది. ప‌లు చోట్ల నివాళుల‌ర్పించారు. పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. దీనికి వారు చెప్పే స‌మాధానం.. ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కుడు. అంతేకాదు.. కాంగ్రెస్ త‌ర‌పున‌ సీఎంగా ప‌ద‌విలో ఉండ‌గానే చ‌నిపోయాడు. అందువ‌ల్ల ఆయ‌న కాంగ్రెస్ నేత‌. ఆయ‌న‌కు ఆ స్థాయి గౌర‌వ‌మ‌ర్యాద‌ల‌న్నీ కాంగ్రెస్ నుంచే వ‌చ్చాయి. కాబ‌ట్టి.. వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి త‌మ‌వాడే అన్న‌ది హ‌స్తం నేత‌ల ప్ర‌క‌ట‌న‌.

వైఎస్ఆర్ పేరు ఎవ‌రు వాడినా.. అంతిమంగా రాజ‌కీయంగా ల‌బ్దిపొందేందుకే అన్న‌ది నిజం. అయితే.. మెజారిటీ షేర్ ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌. వైఎస్ చ‌నిపోయి ద‌శాబ్దం దాటిపోయింది. ఆయ‌న చ‌నిపోయిన వెంట‌నే జ‌గ‌న్ రాజ‌కీయంగా వేగంగా పావులు క‌ద‌ప‌డంతో.. ఆయ‌న సెంటిమెంట్ అక్క‌డ వ‌ర్క‌వుట్ అయ్యింది. ఆ వేడిమీద జ‌నం అటు తిరిగార‌ని కూడా చెప్పొచ్చు. అంతేకాదు.. రాష్ట్ర విభ‌జ‌న‌లో ఏపీకి తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్సే అన్న‌ది ఏపీ ప్ర‌జ‌ల కోపం. దీంతో.. కాంగ్రెస్ అభిమానులంతా జ‌గ‌న్ వెంట నిల‌వాల్సిన అనివార్య‌త‌. ఏపీ తొలి ముఖ్య‌మంత్రిగా బాబు పాల‌న కూడా చూసిన త‌ర్వాత‌.. అప్పుడు ప్ర‌త్యామ్నాయంగా మిగిలిన ఏకైక వ్య‌క్తి జ‌గ‌న్ వైపు అందరూ నిలిచారు. ఇవ‌న్నీ క‌లిసి వ‌చ్చి, వైఎస్ ఆర్ ఫార్ములా స‌క్సెస్ అయ్యింద‌ని అనుకోవ‌చ్చు.

మ‌రి, తెలంగాణ‌లో ఆ ప‌రిస్థితి ఉందా అన్న‌ది ప్ర‌శ్న‌. ఇక్క‌డ వైఎస్ పేరు పాత మ‌రుపుకింద ప‌డిపోయిన‌ట్టే. ప‌దేళ్ల‌లో ఆ పేరును ప‌ల‌వ‌రించిన నేత‌లు ఇక్క‌డ లేరు. జ‌నాల‌కు కూడా అంత అవ‌స‌రం రాలేదు. పైపెచ్చు ఆయ‌న ఆంధ్రావాడు. తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన వ్య‌క్తి. రాష్ట్రం విడిపోతే హైద‌రాబాద్ కు వీసా తీసుకోని రావాల్సి వ‌స్తుంది అని అన్నారు. కాబ‌ట్టి జ‌నాలు ఎప్పుడో ప‌దేళ్ల క్రితం చ‌నిపోయిన వైఎస్ పేరు చెప్ప‌గానే ఓట్లు వేసే ప‌రిస్థితి ఉంటుందా అన్న‌ది డౌటేన‌ని అంటున్నారు. పోనీ.. రాష్ట్రంలో రాజ‌కీయ శూన్య‌త ఉందా.. అంటే అదీలేదు. మ‌రి, ఇలాంటి ప‌రిస్థితుల్లో వైఎస్ ఫొటో ఎంత వ‌ర‌కు ప‌నిచేస్తుంది? ఆయ‌న్ను జ‌నం ఎవ‌రి మ‌నిషిగా గుర్తిస్తారు? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.