YS Jagan – Sharmila : సోదరి షర్మిల తో జగన్ సంధి చేసుకోనున్నారా? తల్లి విజయమ్మను మళ్ళీ దగ్గర చేర్చుకోనున్నారా? వారిని చేరదీయాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన వెంటనే ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెడతారని వార్తలు వస్తున్నాయి. ఇవి జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అందుకే ఆయన కర్ణాటకకు చెందిన కీలక నాయకుడు ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తల్లికి ఎమ్మెల్యే సీటుతో పాటు చెల్లెలు షర్మిల కు ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం. వీలైనంతవరకు షర్మిలను కాంగ్రెస్ పగ్గాలు తీసుకోకుండా ఉంచేందుకు జగన్ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరిట షర్మిల రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో పార్టీకి ఆదరణ దక్కలేదు. దీంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అగ్రనేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో స్పేస్ లేదని.. ఏపీలో కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుందని హైకమాండ్ పెద్దలు తేల్చి చెప్పారు. దీంతో షర్మిల పార్టీ విలీన ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బే షరతుగా మద్దతు తెలపాల్సి వచ్చింది.ఏపీలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలను ప్రయోగించడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. దీంతో జగన్ కలవరపాటుకు గురవుతున్నారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన ద్వారానే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి షర్మిల ప్రయత్నించారు. ఇప్పుడు అదే డీకే ను పట్టుకుని జగన్ కాంగ్రెస్ లో షర్మిల ఎంట్రీని అడ్డుకట్ట వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆస్తులతో పాటు రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తానని.. షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీతో ఏపీలో ఎంటర్ అయితే వైసీపీకి నష్టమని.. ఈ కష్టం నుంచి గట్టు ఎక్కించాలని డీకే శివకుమార్ కు జగన్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
విజయమ్మతో పాటు షర్మిల పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని జగన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కమలాపురం అసెంబ్లీ స్థానాన్ని తల్లికి, కడప పార్లమెంటు సీటు చెల్లి షర్మిలకు కేటాయిస్తానని జగన్ ప్రతిపాదించారని తెలుస్తోంది. కమలాపురం నుంచి విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయన గెలిచే పరిస్థితి లేదు. అందుకే అక్కడ విజయం మన ప్రయోగించి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని జగన్ చూస్తున్నారు. కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పై వివేకా హత్య కేసు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి ఆయన పోటీ చేస్తే ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే షర్మిలను ప్రయోగించాలని చూస్తున్నారు.
కానీ ఈ ప్రతిపాదనకు షర్మిల, విజయమ్మ మద్దతు తెలుపుతారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా వారి మధ్య అగాధం ఏర్పడింది. తెలంగాణలో పార్టీ పెట్టి ఎన్నో రకాల ఇబ్బందులను చవిచూసిన షర్మిలను జగన్ ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి వారిని అక్కున చేర్చుకోవాలని అనుకోవడం విశేషం. మరోవైపు షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం జరగనుంది. జనవరిలో నిశ్చితార్థం, ఫిబ్రవరిలో వివాహం చేయడానికి నిర్ణయించారు. దీనికి జగన్ హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి. ఒకవేళ హాజరైతే కానీ జగన్ ప్రతిపాదనకు కొంతవరకు మొగ్గు చూపే అవకాశం ఉంది. హాజరు కాకుంటే మాత్రం ఆ కుటుంబంలో గొడవలు మరింత పెరిగినట్టే. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడానికి షర్మిల ముందుకు వచ్చినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.