
జగన్ – షర్మిల మధ్య విభేదాలు వచ్చాయనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. అయితే.. ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం బహిర్గతం కాలేదు. చాలా కాలంగా అన్నాచెల్లి కలుసుకోకపోవడం.. విపక్ష నేతలు ఈ విషయం ప్రస్తావిస్తున్నా.. వీరిద్దరూ ఖండించకపోవడం వంటివన్నీ జరుగుతున్న ప్రచారాన్ని బలపరిచాయి. అయితే.. ఇప్పుడు అసలైన సమయం, సందర్భం వచ్చింది. ఇవాళ వైఎస్సార్ వర్ధంతి. ఈ రోజున వీరిద్దరూ కలుసుకుంటారని, బయట జరుగుతున్న చర్చకు ముగింపు పలుకుతారని అభిమానులు, కార్యకర్తలు ఆశించారు. అయితే.. వైఎస్సార్ ఘాట్ చోటు చేసుకున్న సంఘటనలు చర్చకు మరింత అవకాశం ఇచ్చాయి.
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించడానికి జగన్ కుటుంబం మొత్తం ఒకేసారి వెళ్లింది. జగన్, విజయలక్ష్మి, భారతి, షర్మిల ఒకే సమయంలో అక్కడికి వచ్చారు. అయితే.. అన్నాచెల్లెలు మాత్రం కనీసం పలకరించుకోకపోవడం గమనార్హం. అక్కడ ప్రార్థనలు జరిగిన సమయంలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నా.. మాట్లాడుకోలేదు. విజయమ్మ సైతం ముభావంగానే కనిపించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అన్నాచెల్లెలు ఇతర నేతలు, తమను పలకరించిన వారితో మాట్లాడుతూ వెళ్లిపోయారు.
ఈ పరిస్థితి వైఎస్ అభిమానులను షాక్ కు గురిచేసింది. వీరిద్దరూ ఇవాళ కలుసుకుంటారని ఎంతగానో ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. మొన్న రాఖీ పండుగ నేపథ్యంలో షర్మిల రాఖీ కడుతుందని భావించినప్పటికీ.. అది జరగలేదు. జగన్ కు కేవలం సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్ చూసిన వాళ్లు.. ఇవాళ ఖచ్చితంగా ఇద్దరూ కలుసుకుంటారని భావించారు. కానీ.. కనీసం పలకరించుకోకపోవడంతో బయట జరుగుతున్న ప్రచారానికి వీరు బహిరంగంగా మద్దతు తెలిపినట్టైంది.

అంతేకాదు.. ఈ సమయంలో షర్మిల ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టడం కూడా పరిస్థితిని తెలియజేసింది. ‘‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్యూ అండ్ మిస్ యూ డాడ్’’ అని భావోద్వేగానికి గురయ్యారు షర్మిల. ఇది చూసిన వారంతా.. షర్మిల తాను ఒంటరిగా ఉన్నానని పరోక్షంగా చెబుతున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ సైతం తండ్రిని తలుచుకుంటూ ట్వీట్ చేశారు. తాను వేసే ప్రతి అడుగులోనూ, ఆలోచనలోనూ వైఎస్సార్ ఉన్నారని, ఆయన స్ఫూర్తి తనను నడిపిస్తోందని రాశారు.
అయితే.. మొత్తానికి అన్నాచెల్లెల మధ్య సత్సంబంధాలు లేవని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం నేటితో స్పష్టమైందని చాలా మంది అంటున్నారు. మరి, ఈ గ్యాప్ ఎంత దూరం వెళ్తుంది? ఎప్పటి వరకు కొనసాగుతుంది? అన్నది చూడాలి.