Chandrababu: తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో మీడియా చేసే రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పాకులాడే ఈ సెక్షన్ మీడియా.. ఇప్పుడు అదే పార్టీకి శాపంగా మారుతోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత తలా పాపం తిలా పిడికెడు అన్నట్టు వీరి వ్యవహార శైలి ఉంది. చంద్రబాబు బయటపడే మార్గాలను అన్వేషించకుండా.. ప్రజల్లో పలుచన అయ్యేలా వ్యవహరిస్తుండడం విశేషం.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత నెల రోజులుగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. అటు కోర్టుల్లో సైతం సానుకూల తీర్పులు రావడం లేదు.చంద్రబాబు ఇప్పట్లో బయటపడే మార్గం కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎల్లో మీడియా తమకున్న పరపతిని వినియోగించి చంద్రబాబును బయటికి తెచ్చే ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. దీంతో అవి ఫ్రస్టేషన్ లోకి వెళుతున్నాయి. ఏం చేయాలో వాటికి పాలు పోవడం లేదు.
ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబును బయటపెట్టే మార్గాలను అన్వేషించకుండా.. మరిన్ని కష్టాల్లో నెట్టేందుకు కథనాలను వండి వార్చుతున్నారు. ఆ మధ్యన దోమలతో చంద్రబాబు పై హత్యాయత్నం చేస్తున్నారంటూ ప్రచారం చేశారు. జైలులో కనీస వసతులు లేవంటూ కథనాలు రాశారు. డెంగ్యూ బారిన పడి రిమాండ్ ఖైదీలు మృతి చెందుతున్నారని చెప్పుకొచ్చారు. తాజాగా భోజనం తొక్కిసలాటలో ఒక ఖైదీ గాయపడ్డారని ప్రత్యేక కథనం రాశారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ కథనాలు కొనసాగాయి.
అయితే చంద్రబాబుకు జైలులో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. ఆయన ఈ రాష్ట్రానికి మాజీ సీఎం. ఇదో హై ప్రొఫైల్ కేసు. ప్రత్యేక వసతులు కల్పించాలన్న కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆయనకు ఒక ప్రత్యేక బ్లాక్ నే కేటాయించారు. ఫ్యాన్లతోపాటు ఇతరత్రా వసతులు కల్పించారు. సామాన్య ఖైదీలతో ఆయనకు సంబంధమే ఉండదు. అటువంటిది చంద్రబాబు సామాన్య ఖైదీలతో భోజనానికి వెళ్తారా? అన్న కనీస అవగాహన లేకుండా ఎల్లో మీడియా అతి చేయడం దారుణం. ఇది అంతిమంగా చంద్రబాబు కి నష్టం చేస్తుంది. ప్రస్తుతం ఏపీలోని రాజమండ్రి సెంట్రల్ జైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ కాదంటే ఏ తీహార్ కో, అండమాన్ జైలుకు తరలించాల్సి ఉంటుంది. బహుశా ఎల్లో మీడియా అభిప్రాయం కూడా ఇదేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.