Yellow Media: అధికారుల అవినీతిని ఎండగట్టడం మీడియా ప్రధాన విధి. దానిని ఎవరూ కాదనలేం. కచ్చితంగా వారి అవినీతిని ప్రశ్నించాల్సిందే. అదే సమయంలో నిజాయితీ కలిగిన అధికారుల విషయంలో అండగా నిలబడాలి. లేదంటే ఆ అధికారి పనికి అడ్డం పడకూడదు. కానీ ఏపీలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడో మారింది. నిజాయితీ కలిగిన అధికారికి చోటు లేదు. అడ్డగోలుగా, అవినీతి చేసే అధికారులకు మాత్రం రాజకీయ మద్దతు లభిస్తోంది. అటు మీడియా సైతం అటువంటి అధికారుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను ఎల్లో మీడియా టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రవీణ్ ప్రకాష్ సీనియర్ ఐఏఎస్ అధికారి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సైతం చాలా యాక్టివ్ గా పని చేశారు. వివిధ హోదాల్లో ఆయన పనిచేసిన చోట మంచి గుర్తింపు సాధించారు. విజయవాడ, విశాఖ తో పాటు చాలా జిల్లాల్లో ఆయన పనిచేసే సమయంలో సంస్కరణలను అమలు చేశారు. రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పనలో విశేషంగా కృషి చేశారు. సంస్కరణలు అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించారు. అవి సత్ఫలితాలను ఇచ్చాయి. చంద్రబాబుకు సైతం పేరు తెచ్చిపెట్టాయి. కానీ అదే ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు విద్యా శాఖలో చేపడుతున్న సంస్కరణలు మాత్రంమింగుడు పడడం లేదు. అందుకే ఎల్లో మీడియా ఆయనను టార్గెట్ చేస్తూ వచ్చింది.
ప్రస్తుతం ప్రవీణ్ ప్రకాష్ ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్యా శాఖలో కీలక మార్పులకు నాంది పలికారు. ఈ క్రమంలో ఎటువంటి సిఫారసులకు లెక్కచేయకుండా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. పాఠశాలల్లో విద్యా బోధన, వసతుల కల్పన విషయంలో ఉపాధ్యాయులు, అధికారులు తప్పు చేస్తేకఠిన చర్యలకు దిగుతున్నారు. కేవలం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. కానీ దానిని వదిలి ఆయన చర్యలను తప్పుపడుతూ ఎల్లో మీడియా కథనాలు రాస్తుండడం మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి. సమాజానికి మేలు చేయాలన్న ఆయన ప్రయత్నాన్ని నిర్వీర్యం చేసేలా ఉండడం అత్యంత జుగుప్సాకరం.
ఆ మధ్యన ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రవీణ్ ప్రకాష్ పర్యటించారు. పాఠశాలలను తనిఖీ చేశారు. ఆ సమయంలో చాలా రకాల వైఫల్యాలు బయటపడ్డాయి. అందుకు బాధ్యులను చేస్తూ కొంతమంది అధికారులు, ఉపాధ్యాయులపై కఠిన చర్యలకు దిగారు. అయితే జగన్ సర్కారుతో రాజకీయ వైరం ఉన్న ఎల్లో మీడియా ఆయనపై దుష్ప్రచారానికి దిగింది. కానీ తప్పిదాలకు పాల్పడిన అధికారులు, ఉపాధ్యాయుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించింది. కేవలం వారు వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఉండడంతో తమ వారిగా భావించింది. వారిలో ప్రభుత్వ వ్యతిరేక భావనను పెంచేందుకు.. ప్రవీణ్ ప్రకాష్ చర్యలను మరింత ఎండ గట్టింది.
తాజాగా ప్రవీణ్ ప్రకాష్ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. ఆ సమయంలో వైఫల్యాలు బయటపడ్డాయి. దీంతో అధికారులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. దానికి వక్ర భాష్యం చెబుతూ ఎల్లో మీడియా కథనాలు వండి మార్చింది. ” నేను ఆర్డర్ ఇస్తే అంతర్జాతీయ కోర్టులో సైతం స్టే రాదు ” అని ప్రవీణ్ ప్రకాష్ హెచ్చరించినట్లు పతాక శీర్షికలో కథనాలు రాయడం విశేషం. వాస్తవానికి అక్కడ 80 శాతం సిలబస్ పూర్తికాలేదు. విద్యార్థులు ఎలా పరీక్ష రాస్తారు? వారి సామర్థ్యాలు ఎలా పెరుగుతాయి? అన్నదానిపైనే ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులను హెచ్చరించారు. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ.. పాఠశాలలను పర్యవేక్షించకపోవడం ఏమిటని మాత్రమే ప్రశ్నించారు. కానీ అందులో ప్రవీణ్ ప్రకాష్ హెచ్చరికల్ని ఎల్లో మీడియా పరిగణలోకి తీసుకుంది. తాను ఆ స్థాయిలో ఎందుకు హెచ్చరించింది? అది పేద విద్యార్థుల కోసమే? అని మాత్రం ఆలోచించలేకపోయింది. కేవలం ఉపాధ్యాయ వర్గాలను వైసీపీ నుంచి దూరం చేయడానికి ఎల్లో మీడియా ఈ తరహా ప్రచారానికి దిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ముమ్మాటికి మీడియా లక్ష్యానికి వ్యతిరేకమని.. ఎల్లో మీడియా రాజకీయ ప్రయోజనాలకే ఆరాటపడుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.