ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు స్టేట్లకు గవర్నర్లను నియమించారు. తెలంగాణకు తమిళిసై సౌందర రాజన్, ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ లకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం తమిళిసై పాండిచ్చేరి గవర్నర్ గా కూడా ఇన్ చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళిసైను పాండిచ్చేరికి పూర్తి స్థాయి గవర్నర్ గా నియమించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసి పదవీచ్యుడైన యడ్యూరప్పకు (Yediyurappa) గవర్నర్ పదవి ఇచ్చేందుకు కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను పదవి నుంచి తొలగించేటప్పుడే ఈమేరకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అధిష్టానం సూచనల మేరకు యడ్యూరప్పకు తగిన ప్రాధాన్యం కల్పించే క్రమంలో తెలంగాణ గవర్నర్ గా నియమిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈనెల ఆఖరులోగా యడ్యూరప్పకు పదవీ బాధ్యతలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు తొలి గవర్నర్ గా పనిచేసిన నరసింహన్, ప్రస్తుతం ఉన్న తమిళిసై ఇద్దరు తమిళనాడుకు చెందిన వారే. ఈ నేపథ్యంలో యడ్యూరప్పకు అవకాశం కల్పిస్తే మన సరిహద్దు పంచుకున్న కర్ణాటకకు ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మరో వైపు తెలంగాణ రాజకీయాలు, ఇక్కడి వ్యవహరాలపై అవగాహన ఉన్న యడ్యూరప్పను గవర్నర్ గా నియమిస్తే పరిస్థితుల్లో మార్పు వస్తుందని సూచిస్తున్నారు. పార్టీ అగ్రనాయత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఆయన నియామకంపై ఎలాంటి అనుమానాలు లేవని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.