
మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దత్తత గ్రామంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాత్ విసిరారు. మూడు చింతలపల్లిలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారో ఇంటింటికీ తిరుగుదాం వస్తారా అంటూ తెరాస నేతలను నిలదీశారు. గ్రామంలో 57 ఏళ్లు నిండిన వారిలో ఎంతమందికి ఫించను ఇచ్చారని ప్రశ్నించారు. చిన్న ముల్కనూరు గ్రామాన్ని 2015 ఆగస్టు 8న దత్తత తీసుకుంటున్నాని సీఎం కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించారు. కొత్త ఇళ్లు కట్టిస్తామని చెప్పి గ్రామంలోని 247 ఇళ్లను పది రోజుల్లో నేలమట్టం చేశారు. కానీ మూడేళ్లయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించేదు. వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ గుడిసెలు వేసుకుని ఉంటున్నారని ఆరోపించారు.