YCP Split Votes: వైసీపీ వ్యూహం మార్చిందా? కాపులు, క్షత్రియుల్లో విభజనకు తెరలేపిందా? ఓటు చీలికతోనే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కగలనని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు చీలిపోనివ్వనని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన చర్యలు ఉన్నాయి. అయితే పవన్ రూపంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించాలని వైసీపీ ప్లాన్ రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కాపుల్లోని ఉప కులాలను, క్షత్రియ సామాజికవర్గంలో చీలికి తెచ్చి ప్రయోజనం పొందాలని భావిస్తోంది.
గోదావరి జిల్లాల్లో..
ఏపీలో అధికారంలో రావాలంటే ఉభయ గోదావరి జిల్లాలు కీలకం. అక్కడ గెలుపొందాలంటే కాపులు, క్షత్రియుల మద్దతు అవసరం. అయితే ఆ రెండు వర్గాలు జనసేన వెంట ఉన్నాయి. వాటిలో చీలికి ఎలా తేవాలన్నదానిపై వైసీపీ ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే కాపుల ఉప కులాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కాపుల్లో బలిజ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి పేరిట ముందుకెళుతోంది. వారి అభిమానాన్ని చూరగొనాలని చూస్తోంది.
బలిజలపై ఫోకస్..
ఇప్పటికే బలిజలకు రాజకీయ ప్రాధాన్యమిచ్చిన జగన్.. కాపుల నుంచి వేరుచేసే ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బలిజలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనున్నారు. దీంతో కాపుల్లో 30 నుంచి 40 శాతంగా ఉన్న బలిజల ఓట్లు తమకు పడేలా చూసుకునేందుకు ప్లాన్ రూపొందించినట్టు సమాచారం. ఇక మిగిలిన వారిలోనూ 20 నుంచి 40 శాతం ఓట్లు తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహం వేస్తే.. తిరుగు లేదనే అభిప్రాయం వైసీపీలో వ్యక్తమవుతోంది. మొన్న ఆ మధ్యన కాపులతో తమ ప్రయోజనాలు గండిపడుతున్నాయన్న అభిప్రాయం వచ్చేలా ఒకరిద్దరు బలిజ నాయకులతో వైసీపీయే మాట్లాడించిందన్న ప్రచారం ఉంది.
రాజుల ఆగ్రహం..
అటు క్షత్రియ సామాజికవర్గం నుంచి ఎదురయ్యే ప్రతికూలతను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణంరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజులను జగన్ సర్కారు ఏ స్థాయిలో వేధించిందో అందరికీ తెలిసిందే. దీనిని క్షత్రియ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. మంత్రివర్గ విస్తరణలో ఉన్న ఒక్కగానొక్క పదవి తొలగించేసరికి ఆగ్రహంగా ఉంది దీంతో తమకు ప్రతికూలత తప్పదని భావిస్తున్న వైసీపీ బీజేపీలోని క్షత్రియ సామాజికవర్గ నేతలతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలని చూస్తోంది. ఆ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో చూడాలి.