Jaganannaku Chebudam: ‘జగనన్నకు చెబుదాం’ వర్కవుట్ అవుతుందా?

ఏపీ ప్రజలు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా మౌలిక వసతులు లేక ఇబ్బందిపడుతున్నారు. వాటి గురించి క‌థ‌లుక‌థ‌లుగా చెప్ప‌డానికి జ‌నం సిద్ధంగా ఉన్నారు.

Written By: Dharma, Updated On : May 9, 2023 12:48 pm
Follow us on

Jaganannaku Chebudam: ‘ ఏపీ సీఎం జగన్ జనం బాట పడుతున్నారు. జనాల మధ్య ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి బటన్లు నొక్కడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలను సైతం ప్రజల మధ్యే చేస్తున్నారు. తొలి మూడేళ్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టని ఆయన ఇప్పుడు ఏకంగా జిల్లాలను చుట్టేస్తున్నారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని చూపుకోవడానికి, చెప్పుకోవడానికి జగన్ తెగ ఆరాటపడుతున్నారు. ప్రభుత్వపరంగా గడపగడపకూ మన ప్రభుత్వం, పార్టీపరంగా జగనన్న నువ్వే మా నమ్మకం కార్యక్రమాలు చేపట్టారు. అవి వంద శాతం సక్సెస్ అయ్యాయని చెబుతున్నారు. అదే స్ఫూర్తితో ‘జగనన్నకు చెబుదాం’ అంటూ కొత్త కార్యక్రమానికి సిద్ధపడుతున్నారు.

జనం సిద్ధమే కానీ..
ఏపీ ప్రజలు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా మౌలిక వసతులు లేక ఇబ్బందిపడుతున్నారు. వాటి గురించి క‌థ‌లుక‌థ‌లుగా చెప్ప‌డానికి జ‌నం సిద్ధంగా ఉన్నారు. అయితే వినే ఓపిక, పరిష్కరించే బాధ్యతను యంత్రాంగం తీసుకుంటుందా? అదీ లేదు. ఎందుకంటే నిధుల లేమి వెంటాడుతోంది. వెనువెంటనే సమస్యకు పరిష్కార మార్గం చూపించాలంటే నిధులుఅవసరం. ఇప్పటికే ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్రభుత్వం ‘స్పందన’ వంటి వేదికలను ఏర్పాటుచేసింది. అయితే అందులో వినతుల పరిష్కారం అంతేంతే. ఇప్పుడు జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

గతంలో ఇటువంటి ప్రయత్నమే..
టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా చంద్రబాబు ఇటువంటి ప్రయత్నాలు చాలా చేశారు. కానీ వాటి ఫలితం కంటే.. ప్రతికూలతలే ఎక్కువ. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. 1902 టోల్ ఫ్రీ నంబర్ కు వినతులు కంటే ఫిర్యాదులే అధికంగా వస్తాయి. కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలంటే ప్ర‌భుత్వం కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. టోల్ ఫ్రీ నంబ‌ర్‌కు వెళ్లే కాల్స్‌ను రిసీవ్ చేసుకునే వారికి సంబంధిత స‌బ్జెక్టుల్లో అవ‌గాహ‌న ఉండాలి. సహజంగా సంక్షేమ పథకాలు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయవచ్చు. అలాగే రెవెన్యూ సమస్యలపై కూడా మొరపెట్టుకునే అవకాశం ఇచ్చారు.

ఓపిక చాలా అవసరం..
అటు సమస్యలు, ఇటు ఫిర్యాదులు అందించడానికి వేదిక కాబట్టి కాల్ సెంటర్ సిబ్బంది కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వినే ఓపిక ఉండాలి. ఇది ఒక ఉద్యోగంగా కాకుండా, సేవా కార్య‌క్ర‌మంగా భావించి ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌ని చేయాలి. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోతే, ప‌దేప‌దే అదే అంశంపై కాల్స్ వ‌స్తున్నాయ‌నే అస‌హ‌నానికి గురి కాకూడ‌దు. టోల్ ఫ్రీ నంబ‌ర్‌కు ఫోన్ చేస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌నే భ‌రోసా క‌ల్పించేలా వ్య‌వ‌హ‌రించాలి. అయితే ఇదంతా జరుగుతుందా? అన్న టాక్ నడుస్తోంది. పైగా ఎన్నికల చివరి ఏడాది సమయం కావడంతో రాజకీయ ప్రశ్నలు, వేధింపులే అధికంగా ఉంటాయి. ఈ తరుణంలో జగనన్నకు చెబుదాం కాన్సెప్ట్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.