TDP Janasena Alliance: ఏపీలో టిడిపి-జనసేన పొత్తును ఎలాగైనా చిత్తు చేయాలని వైసిపి భావించింది. ఆ రెండు పార్టీలు కలవకూడదని కోరుకుంది. ఇందుకు బిజెపి ద్వారా ఎంతలా ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. కానీ పవన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు జైల్లో ఉండగానే టిడిపి తో పొత్తు ప్రకటన చేశారు. అయితే ఇది జనసేన లోని ప్రో వైసీపీ నేతలకు నచ్చలేదు. కొందరు బాహటంగానే వ్యతిరేకించారు.. మరికొందరు అధినేత పై విమర్శలు చేస్తూ బయటకు వచ్చారు. మరికొందరు అయిష్టంగానే పార్టీలో కొనసాగుతున్నారు. చివరి వరకు ఉండి.. వారితో పొత్తుకు విఘాతం కలిగించాలన్నది వైసిపి ప్లాన్ గా ప్రచారం జరుగుతోంది. పొత్తుపై వైసిపి అనుకూల మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా సమన్వయ కమిటీ సమావేశాల్లో జరుగుతున్న వివాదాలను భూతద్దంలో పెట్టి చూపిస్తోంది. సీట్లు, ఓట్ల సర్దుబాటు అంత ఆషామాషీగా జరగవని.. టిడిపి, జనసేన మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుందని వైసీపీ ఆశిస్తుంది. కానీ 175 నియోజకవర్గాల్లో.. ఒకటి, రెండు చోట్ల తప్ప మెజారిటీ నియోజకవర్గాల్లో మాత్రం రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలు సజావుగా పూర్తి కావడం విశేషం.
అయితే కాపు నియోజకవర్గాల్లోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అటు టిడిపి, ఇటు జనసేనకు కాపు నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. అనకాపల్లి, పిఠాపురంలో కాపుల జనాభా అధికం. అటువంటి చోట టిడిపికి ధీటుగా జనసేన ఉంది. అభ్యర్థిత్వలను ఆశిస్తోంది. దీంతో ముఖాముఖిగా సమావేశం అవుతున్న రెండు పార్టీల శ్రేణుల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమవుతోంది. గత ఎన్నికల్లో తాము సాధించిన ఓట్లు బట్టి టికెట్ తమ పార్టీకే వస్తుందని.. తానే అభ్యర్థిని అవుతానని ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో మీకు సహకరించాము కనుక… ఈసారి తమకు విడిచి పెట్టాలని జనసేన నాయకులు కోరుతున్నారు. హై కమాండ్ ఎటువంటి ప్రకటనలు చేయకున్నా.. తమకు తామే అభ్యర్థులమని చెబుతున్నారు. దీంతో వివాదాలు రేగుతున్నాయి.
అయితే కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న చోట మాత్రం సర్దుబాటు చాలా ఈజీగా ముందుకెళ్లడం గమనార్హం. తెనాలిలో పోటీ చేస్తానని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అక్కడ టిడిపి ఇన్చార్జిగా ఆలపాటి రాజా ఉన్నారు. దీంతో అక్కడ టికెట్ వివాదం నెలకొంటుందని అంతా అభిప్రాయపడ్డారు. అటు వైసీపీ సైతం అక్కడ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడం కష్టమని భావించింది. కానీ అందుకు విరుద్ధంగా ఆ ఇద్దరు నేతలు ఒకటి కావడం విశేషం. ఇటీవల టిడిపి జనసేన నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. టిడిపి నుంచి ఆలపాటి రాజా, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్లు హాజరయ్యారు. ఇద్దరు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దించటం కోసం కలిసి పని చేయాలని ఇరు పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక్కడ అభ్యర్థి ఎవరనేది ఇరు పార్టీల అగ్రనాయకత్వాలు చర్చించి ప్రకటిస్తాయని తేల్చేశారు. దీంతో అక్కడ వివాదానికి అవకాశం లేదని తేల్చి చెప్పారు.
ఇప్పటికే అనకాపల్లి, పిఠాపురంలో సమన్వయ కమిటీ సమావేశాలు రచ్చగా మారాయి. తాజాగా జగ్గంపేటలో సైతం రెండు పార్టీల మధ్య వివాదం తలెత్తింది. అయితే ఈ పరిస్థితిని రెండు పార్టీల నాయకత్వాలు ఊహించాయి. అయితే మెజారిటీ నియోజకవర్గాల్లో రెండు పార్టీల శ్రేణులు ఇట్టే కలిసిపోతున్నాయి. జగన్ సర్కార్ను గద్దించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. అయితే నేతల గొడవలపై ఎక్కడా పార్టీలు ప్రకటనలు చేయడం లేదు. ఒక వ్యూహం ప్రకారమే నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కలుగ చేసుకుంటే అది పొత్తు ధర్మంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వైసీపీ అనుకూల మీడియాకు ఇది ప్రచారాస్త్రంగా మారుతుంది. అందుకే వీలైనంత త్వరగా సమన్వయ కమిటీ సమావేశాలు పూర్తిచేసి.. అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ వస్తే రాజకీయ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే టిడిపి, జనసేనల మధ్య పొత్తు మరో అడుగు ముందు పడే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది.