
గడిచిన పదేళ్లలో దేశంలో సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే.. మీడియాకు ధీటుగా నిలబడేలా! రాజకీయ పార్టీలు సైతం సొంతంగా కార్యకర్తలను తయారు చేసుకునేలా! సోషల్ మీడియాలోనే రాజకీయం కొనసాగించేలా! కరోనా నేపథ్యంలో బహిరంగ ఉద్యమాలకు అవకాశం లేకపోవడంతో.. పాలిటిక్స్ మొత్తం సోషల్ మీడియా కేంద్రంగానే సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
దీంతో.. ‘ఆత్మస్తుతి.. పరనింద’ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడానికి ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్ లు పుట్టుకొచ్చాయి. పార్టీ సానుభూతిపరులకు వీరు అదనం అన్నమాట. ఇంకా చెప్పాలంటే.. వీరు ‘‘ట్రెయిన్డ్ ఇన్ డెహ్రాడూన్’’ టైపు అన్నమాట. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే శిక్షణ తీసుకొని డ్యూటీ మొదలు పెట్టిన బ్యాచ్ అన్నమాట. తాము పని చేస్తున్న పార్టీని ఆకాశానికి ఎత్తడం.. పక్కవాళ్లను పాతాళానికి తొక్కేయడమే వీరి పని. ఇందుకోసం.. విమర్శలను ఆశ్రయిస్తే పర్వాలేదు. కానీ.. అసత్యాలను, అభూత కల్పనలను సైతం యథేచ్ఛగా వాడేస్తున్నారు. ఇందులో వారూవీరని తేడా లేదు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సోషల్ మీడియా బ్యాచ్ లోనూ ఇలాంటి వారు ఉన్నారనే విమర్శ ఉంది. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను చూస్తేనే.. ఇది అర్థమైపోతుంది.
గడిచిన కొన్నేళ్లుగా ఈ పరిస్థితి శృతిమించడంతో.. అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా టీమ్ కు చెందినవాడిగా చెప్పబడుతున్న ఓ వ్యక్తి రెండోసారి జైలుకు వెళ్లడం కలకలం రేపింది. బెయిల్ షరతులను ఉల్లంఘించిన కారణంగానే.. ఆయన్ను రెండోసారి అరెస్టు చేసినట్టు సమాచారం. తాజాగా మరో ఇద్దరూ అరెస్టు అయినట్టు తెలుస్తోంది. వీరే కాకుండా.. మరికొంత మందికి నోటీసులు కూడా ఇచ్చినట్టు సమాచారం. వీరందరినీ సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.
దీంతో.. వైసీపీ సోషల్ మీడియా టీమ్ లో భయాందోళన నెలకొందని చెబుతున్నారు. ఈ టీమ్ ను లీడ్ చేసే అగ్రనేతలు అండగా ఉంటామని చెబుతున్నా.. పట్టించుకోవట్లేదని కార్యకర్తలు బాధపడుతున్నారట. పరిస్థితి ఇంతదాకా వచ్చినా.. ఏమీ కాదని ధైర్యం చెప్పే ప్రయత్నం మినహా.. ఇంకేమీ చేయట్లేదనే చర్చ సాగుతోంది. వీరికి అండగా నిలిస్తే.. తామే నడిపిస్తున్నామన్న విషయం బయటపడుతందనే ఉద్దేశంతోనే నేతలు మౌనంగా ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. ఎందుకొచ్చిన గొడవ అని కొందరు తమ అకౌంట్లు డెలీట్ చేస్తున్నారట. మరికొందరు.. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటున్నారట. మరి, రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.