Pawan Kalyan- Ali: రాజకీయాలు వేరు..సినిమాలు వేరు. స్నేహితులుగా ఉన్నవారు ఒకే పార్టీలో ఉండాలని లేదు. అలాగే ఒకే పార్టీలో ఉన్నవారు స్నేహంగా ఉండడం లేదు. సమయం, సందర్భం, అవసరం బట్టి ఒక్కొక్కరూ ఒక్కోపార్టీలో చేరుతుంటారు. ఈ కోవలోకి వస్తారు సినీ నటుడు అలీ. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికై ముచ్చట తీర్చుకుందామన్న సరదా అలీకి ఎప్పటి నుంచో ఉంది. చాలా రోజులుగా ఆయన టీడీపీతో జర్నీ చేశారు. అటు తన ఆప్త మిత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా అటుగా వెళ్లేలేదు. గత ఎన్నికలకు ముందు ఆయన అనూహ్యంగా వైసీపీ గూటికి చేరారు. ఆ సమయంలోనే పవన్ స్పందించారు. తన మిత్రుడు అలీ తనను మోసం చేసి వెళ్లిపోయాడని.. ఆయన అడిగారని నరసాపురం ఎంపీ టిక్కెట్ ఆయన సన్నిహితుడికి ఇచ్చిన విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. దీనిపై అలీ కూడా అదే రేంజ్ లో రిప్లయ్ ఇచ్చారు. నేనెప్పుడూ మీ సాయం పొందలేదని తేల్చేశారు. బాల్య నటుడిగా ఎంట్రీ ఇచ్చిన తాను పవన్ కంటే సీనియర్ అని అర్ధం వచ్చేలా మాట్లాడారు. అటు తరువాత పవన్, అటు అలీ సైలెంట్ అయ్యారు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు.

అయితే తాజాగా అలీని పవన్ పై వైసీపీ ప్రయోగించే చాన్స్ ఉంది. ఇప్పటికే పవన్ దూకుడు మీద ఉన్నారు. వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీని ఇరుకున పెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. పవన్ కామెంట్స్ కు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోంది. ఈ క్రమంలో పవన్ ను నిలువరించడం అధికార పార్టీకి సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. అటు సినీ పరిశ్రమ కూడా ఇంటర్నల్ గా పవన్ ను సపోర్టు చేయడం ప్రారంభించింది. దీంతో జగన్ కు ఏంచేయాలో పాలుపోవడం లేదు. అందుకే సడెన్ గా అలీకి మీడియా సలహాదారు పదవి ఇప్పించారు. అటు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు రప్పించుకున్న జగన్ పవన్ ను నిలువరించే బాధ్యతలు ఆర్జీవీపై పెట్టారు.

అలీకి మీడియా సలహాదారు పదవి కట్టబెట్టడం వెనుక పెద్ద స్కెచ్ ఉంది. అలీతో నేరుగా పవన్ కు కౌంటర్ ఇవ్వనున్నట్టు తెలిసింది. సినిమారంగంలో పవన్ తో అలీ సుదీర్ఘ కాలం ట్రావెల్ చేశారు. పవన్ బలం, బలహీనతలు అలీకి తెలుసు. అందుకే అలీని తురుపు ముక్కలా ప్రయోగించాలని భావిస్తున్నారు. గత ఎన్నికలు ముందు పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ను ఇదే విధంగా ప్రయోగించారు. సాక్షిలో ఉద్యోగి మాదిరిగా కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. పవన్ పై ఆమె నేరుగా విమర్శలు చేయకున్నా…అదే స్థాయి భావన వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అలీని కూడా మీడియా ముందు కూర్చోబెట్టి పవన్ పై విమర్శలు చేయించనున్నారు. పవన్ వ్యక్తిగత విమర్శలైతే పర్సనల్ కామెంట్స్, రాజకీయంగా చేస్తే అదే స్థాయిలో.. అటు సినిమాపరంగా లొసుగులు ఇలా అన్నింటిపై అలీతో మాటలు బాంబులు వేయడానికి జగన్ అండ్ కో ఏర్పాట్లు చేస్తోంది. అయితే మీడియా సలహాదారు పదవికి ఆశపడి అలీ చేస్తారో.. లేకుంటే సంయమనం పాటిస్తారో చూడాలి మరీ..