టీడీపీకి తొలినుంచి ఉత్తరాంధ్ర కంచుకోటగా ఉండేది. కిందటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రులు వైసీపీకి జై కొట్టారు. ఉత్తరాంధ్రలో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో మొత్తానికి మొత్తం సీట్లన్నీ కూడా వైసీపీ ఖాతాలోకి వచ్చిచేరాయి. వైసీపీ బలంగా నిలిచిన ఉత్తరాంధ్రకు సీఎం జగన్ ధన్యావాదాలు చెబుతున్నట్లుగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ఆ ప్రాంతవాసులు పెద్దఎత్తున నిరసన చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం విశాఖను రాజధానిగా మార్చేందుకే మొగ్గుచూపుతుంది.
విశాఖను రాజధానిగా ప్రకటించడం వల్ల వైసీపీకి ఈ ప్రాంతంలో మరింత బలం చేకూరడం ఖాయమని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అంతేకాకుండా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న టీడీపీకి ఈప్రాంతంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ బలంగా నిలిచిన ఉత్తరాంధ్రను ఆదుకోవడంతోపాటు టీడీపీని కోలుకుండా చేసేందుకు సీఎం జగన్ పావులు కదుపుతున్నారు.
మూడు ప్రాంతాలను ముగ్గురికి పంచిన జగన్?
ఇందులో భాగంగానే రేపోమాపో విశాఖ పరిపాలన రాజధాని మారడం ఖాయంగా కన్పిస్తుంది. దీంతోపాటు ఈ ప్రాంతంలో టీడీపీ బలంగా ఉన్న నేతలను వైసీపీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. విశాఖ రాజధానిని టీడీపీ నేతలు వ్యతిరేకిస్తుండటం స్థానికంగా ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది. దీంతో టీడీపీ చెందిన పలువురు ముఖ్యనేతలు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ఆకర్ష్ మంత్రానికి తెరతీసింది.
టీడీపీకి తొలి నుంచి బలంగా ఉన్న నేతలను వైసీపీలో చేర్చుకొనేందుకు ప్లాన్ చేస్తోంది. మాజీ మంత్రులు, బలమైన నేతలపై వైసీపీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండటంతో కొందరు టీడీపీ నేతలు వారి స్వప్రయోజనాలు, వ్యాపార, ఆర్ధిక లావాదేవీలకు ఆటంకం రాకుండా వైసీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని విజయనగరంలో టీడీపీ తుడిచి పెట్టుకుపోయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాల్లోనూ వైసీపీ ఆకర్ష్ మంత్రం పనిచేస్తుండటంతో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యేలా కన్పిస్తున్నాయి.