Chandrababu: ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. బిజెపితో పొత్తు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. సుమారు గంట పాటు చర్చించారు. అటు చంద్రబాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో టిడిపి ఎంపీలతో పాటు వైసీపీ ఎంపీలు సైతం కలిశారు. మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యే ఆశావహులు సైతం పెద్ద ఎత్తున కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీలో చంద్రబాబు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంట్లో బస చేశారు. అటు గల్లా జయదేవ్ ఇంట్లో ఎంపీలతో కీలక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కంభంపాటి రామ్మోహన్ సైతం ఉన్నారు. అయితే ప్రత్యేకంగా లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబుతో చర్చలు జరపడం విశేషం. దాదాపు గంట పాటు ఆయన చర్చించారు. ఇటీవలే నరసరావుపేట ఎంపీ సీటును శ్రీకృష్ణదేవరాయలకు ఇవ్వకుండా వైసిపి మొండి చేయి చూపింది. ఆయన స్థానంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరును ప్రకటించింది. దీంతో లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా ప్రకటించారు. టిడిపిలోకి టచ్ లోకి వచ్చారు. అయితే ఆయన టిడిపిలో చేరతారా? లేకుంటే బిజెపిలోకి వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం పొత్తుకు బిజెపి సానుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బిజెపి ఎక్కువగా పార్లమెంటు స్థానాలను అడుగుతోందని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే బలమైన అభ్యర్థులు ఆ పార్టీకి అవసరం. అయితే తొలుత శ్రీకృష్ణదేవరాయలు టిడిపిలో చేరతారని బలమైన ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు అడ్డుకున్నట్లు సమాచారం. అందుకే శ్రీకృష్ణదేవరాయలు తాను టిడిపిలో చేరతానని ప్రకటించలేదు. దీని వెనుక చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా నరసరావుపేట ఎంపీ సీటును బిజెపికి కేటాయించే అవకాశం ఉందని.. అందుకే వెయిట్ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే చంద్రబాబును కలిసిన శ్రీకృష్ణదేవరాయలు మీడియా ముందు నోరు తెరవలేదు. కానీ గల్లా జయదేవ్ ఇంట్లో దాదాపు గంటకు పైగా చంద్రబాబుతో చర్చలు జరపడం విశేషం.
అయితే ఒక్క శ్రీకృష్ణదేవరాయలే కాదు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైతం బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. బిజెపితో పొత్తు, సీట్లు సర్దుబాటు జరిగే వరకు ఆ నేతలు పార్టీలో చేరరు. ఒకవేళ పొత్తు లేకుంటే వారంతా టిడిపిలో చేరే అవకాశం ఉండేది. అప్పుడు సీట్ల సర్దుబాటు కూడా కష్టంగా మారనుంది. అందుకే ఆ నేతలను బిజెపిలోకి చేర్పించి.. పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటు చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. పొత్తు కుదిరితే బిజెపిలోకి వెళ్తారు.. లేకుంటే మాత్రం టిడిపిలో చేరతారు అని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు