YCP MLAs- Janasena: జనసేనలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారా? వారంతా సమయం కోసం వేచిచూస్తున్నారా? ఇప్పటికే వారు జనసేన కీలక నేతలకు టచ్ లో ఉన్నారా? ఎన్నికల నాటికి వారంతా చేరే అవకాశముందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అటు జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. మాజీ హోం మంత్రి, పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, కాపు రామచంద్రారెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవులకు రాజీనామా చేయడానికి అదే కారణంగా తెలుస్తోంది. వీరిద్దరూ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినా.. పార్టీలో ఏమంత కంఫర్టుగా లేరు. వైసీపీలో ఉంటే రాజకీయంగా ఎదగలేమని భావిస్తున్నారుట. అందుకే జనసేనలో చేరాలని దాదాపు డిసైడ్ అయినట్టు సమాచారం. ఎన్నికల నాటికి వీరు జనసేనలో చేరడం ఖాయమని అనుచరులు చెబుతున్నారు.

విశాఖ జిల్లాలో కూడా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. చాలమంది ఎమ్మెల్యేలు జనసేనలో చేరుతారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే కరణం ధర్మశ్రీ కాపు వైసీపీ ప్రజాప్రతినిధుల సమావేశానికి గైర్హాజరై ఝలక్ ఇచ్చారు. ఇప్పడు తాజాగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీచేసిన అదీప్ రాజు 33 సంవత్సరాల పిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిపోయారు. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, వివాదాస్పద స్థలాలు అధికం. రాజకీయ అనుభవం లేకపోవడంతో ఆయనపై చాలా మంది వైసీపీ నాయకులు కమాండ్ చేస్తున్నారు. భూ వివాదాల్లో వారు లబ్ధి పొంది అపవాదును అదీప్ రాజుపై వేస్తున్నారు. దీనిపై పలుమార్లు సీఎంవోలో పంచాయతీలు నడిచాయి. అటు అధిష్టాన పెద్దలు కూడా అదీప్ రాజుకు చీవాట్లు పెట్టారే తప్ప నిజంగా తప్పుచేసిన వారికి వెనుకేసుకొచ్చారు. అప్పటి నుంచి అదీప్ రాజు మనస్తాపంతోనే ఉన్నారు.

మరోవైపు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు అధిష్టానం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని అదీప్ రాజు నమ్ముతున్నారు. పూర్వాశ్రమంలో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ బాబు సేవలను వినియోగించుకోవాలని వైసీపీ అధిష్టానం చూస్తోంది. నియోజకవర్గంలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. ప్రస్తుతం జనసేన బలంగా ఉన్న జిల్లాలో విశాఖ ఒకటి. అందుకే అదీప్ రాజును తప్పించి పంచకర్లను లైన్ లోకి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్టాలు ఓర్చి పార్టీని నిలబెడితే తనను రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని అదీప్ రాజు ఆవేదనతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన వైపు మొగ్గుచూపుతున్నారు. కీలక నేతల వద్ద తన మనోగతాన్ని వెల్లడించారు. అయితే దీనిపై జనసేనాని సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే పెందుర్తి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని వైసీపీ ప్రకటించిన మరుక్షణం అదీప్ రాజు జనసేనలో చేరడం ఖాయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు.