
Jagan- TDP: ఏపీలో అధికార వైసీపీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. కానీ జగన్ మాత్రం దానిని లైట్ తీసుకుంటున్నారు. తాను ప్రాధాన్యమిస్తున్న సంక్షేమం ముందు వ్యతిరేకత కొట్టుకుపోతోందని భావిస్తున్నారు. అందుకే తాను క్లాస్ వార్ చేస్తున్నానని చెబుతున్నారు. సమాజంలో పేదల కోసం సంక్షేమాన్ని అమలుచేసేందుకు మిగతా వర్గాలతో ఫైట్ చేస్తున్నానని నమ్మబలుకుతున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి.. అలా చెబుతున్నా.. సమాజంలో మిగతా వర్గాలకు మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత గణనీయంగా పెరుగుతోంది. దానిని అధిగమించకపోతే మాత్రం జగన్ కు ప్రతికూల ఫలితాలు, పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఇప్పటికీ ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడే చాన్స్ జగన్ సర్కారుకు ఉంది. తప్పిదాలను సరిచేసుకునే వెసులబాటు ఉంది. ఇది నిఘా వర్గాల నుంచో..లేకుంటే ఐ ప్యాక్ బృందం చెబుతుందో కాదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చెబుతున్న మాట ఇది. ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టిన సంగతి తెలిసిందే, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకునేందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రజలు స్వయంగా ముందుకొచ్చి తమ సమస్యలను విన్నవించారు. వాటిని టీడీపీ నేతలు ఒక బుక్ లెట్ లో రాసుకున్నారు.ఇలా టీడీపీ సేకరించిన శాంపిళ్లు 30 లక్షలకుపైగా ఉన్నట్టు తెలుస్తోంది.

టీడీపీ సేకరించిన శాంపిళ్లలో నిత్యావసరాల ధరలు, తాగునీరు, రహదారులు, మౌలిక వసతులు, పంటలకు గిట్టుబాటు, మద్య నిషేధం, అవినీతి, నిరుద్యోగం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి వాటిపై ప్రజలు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో జగన్ పాలన సాగించలేకపోయారని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిచ్చి అభివృద్ధిని గాలికొదిలేశారని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే టీడీపీ చేపట్టిన శాంపిళ్ల సేకరణలో వైసీపీ సర్కారుకు ఊరట కలిగించే విషయాలు బయటపడ్డాయి. ప్రజా వ్యతిరేకత ఉంది కానీ.. అది పతాక స్థాయిలో లేదని తేలిపోయింది. టీడీపీ శాంపిళ్ల సేకరణలో ఏ అంశం తీసుకున్నా 30 శాతంలోపే వ్యతిరేకత కనిపించింది.
ఇంకా ప్రభుత్వానికి ఏడాది సమయం ఉంది. నిత్యావసరాల ధరలు, మద్య నిషేధం, మౌలిక వసతుల కల్పన వంటివి జగన్ సర్కారు చేతిలో ఉన్నాయి. వాటిపై కాస్తా దృష్టిపెడితే ప్రభుత్వంపై వ్యతిరేకతనుతగ్గించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రేషన్ బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా అందిస్తున్న సంగతి తెలిసిందే. అదే వాహనం ద్వారా తక్కువ ధరకు నిత్యావసరాలు పంపిణీ చేసే అవకాశం ఉంది. అలాగే సంపూర్ణ మద్య నిషేధం,పాడైన రహదారులు బాగుచేయడం వంటివి జగన్ చేతిలో ఉన్నాయి. అయితే ఏంచేయాలన్నా ఆర్థికభారంతో కూడుకున్న పని. సంక్షేమంతో గట్టెక్కుతానని భావిస్తున్న జగన్ ఈ ఖర్చుకు కచ్చితంగా వెనుకాడతారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అమలుచేయలేరు కూడా. అయితే టీడీపీ ఎంతో కష్టంతో సేకరించి ఇచ్చిన శాంపిళ్లను జగన్ సద్వినియోగం చేసుకునే స్థితిలో లేరు.
