YCP MLA: కేరళలో వైసీపీ ఎమ్మెల్యే టోల్ స్కాం

సోదరుడు ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అప్పటికి ఆయన కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు. ఓ రెండు సంస్థలతో కలిసి కేరళలో జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టారు.

Written By: Dharma, Updated On : October 21, 2023 5:51 pm

YCP MLA

Follow us on

YCP MLA: వైసిపి నేతల అవినీతికి అంతే లేకుండా పోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మూలాలు ఏపీలో బయటపడ్డాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు పాత్ర వెలుగు చూసింది. ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు కూడా. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి జాతీయ రహదారి నిర్మాణం చేపట్టకుండానే టోల్ టాక్స్ వసూలు చేయడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ను 102 కోట్ల రూపాయల మేర మోసం చేశారన్న ఆరోపణపై ఉచ్చు బిగించింది.

సోదరుడు ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అప్పటికి ఆయన కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు. ఓ రెండు సంస్థలతో కలిసి కేరళలో జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. అయితే రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకుండానే టోల్ టాక్స్ వసూలు చేశారన్న ఫిర్యాదుతో సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఈనెల 16న విక్రమ్ రెడ్డికి చెందిన కేఎంసి కంపెనీలో విస్తృత సోదాలు చేపట్టింది. బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు, ఎఫ్డిలను ఈడీ సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

2006లో కేరళలో బిఓటి పద్ధతిలో జాతీయ రహదారి నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను రెండు సంస్థలు దక్కించుకున్నాయి. కోల్కతాకు చెందిన భారత్ రోడ్ నెట్వర్క్ లిమిటెడ్, గురువాయూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కాంట్రాక్ట్ పొందాయి. వీటి నుంచి సబ్ కాంట్రాక్ట్ పొందిన విక్రమ్ రెడ్డి కేఎంసి.. రోడ్డు డిజైన్, నిర్మాణం, అభివృద్ధి, ఫైనాన్స్, ఆపరేషన్ తో పాటు నిర్వహణ బాధ్యత తీసుకుంది. కేఎంసి ఎండిగా ఉన్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఎన్హెచ్ఏఐ అధికారులతో, కేరళకు చెందిన కొందరు స్వతంత్ర ఇంజనీర్లతో కలిసి కుట్రపడ్డారని.. రోడ్డు పూర్తి చేయకుండానే పదేళ్లపాటు టోల్ వసూలు చేశారన్నది అభియోగం. దీనిపై ఫిర్యాదు రావడంతో సిబిఐ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. అరకొరగా జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టి రూ. 102 కోట్ల మేర జాతీయ రహదారి సంస్థకు మోసగించినట్లు సిబిఐ తేల్చింది. బస్సుబేలు, బస్ షెల్టర్ల నిర్మాణం, వాటిలో ప్రకటనలు, నాసిరకం సర్వీస్ రోడ్డు నిర్మాణం వంటి లోపాలను సిబిఐ గుర్తించింది. రోడ్డు నిర్మాణానికి రూ.721 కోట్లు ఖర్చు చేసి.. రూ.1250 కోట్లు టోల్ రూపంలో వసూలు చేసినట్లు సిబిఐ గుర్తించినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈడి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్ సత్యవీర్ సింగ్ నేతృత్వంలోని 8 మంది ఈడి అధికారుల బృందం గత సోమవారం సోదాలు చేపట్టింది. కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్ డిపాజిట్లను కలిపి 125 కోట్ల మేరకు సీజ్ చేసినట్లు తెలిసింది. అయితే ఇందులో కేఎంసి కన్స్ట్రక్షన్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.1.37 కోట్లు మాత్రమేనని తేలింది. దీనిపై చట్టపరమైన చర్యలకు తీసుకునేందుకు ఈడీ ఉపక్రమించింది. మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ స్కాం మాదిరిగానే తాజాగా ఈ కేసు వెలుగులోకి రావడం వైసిపికి ఇబ్బందికర పరిణామమే.