Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి.. దివంగత సీఎం నందమూరి తారక రామారావు కుమార్తె. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి. అటు తండ్రి, ఇటు భర్త రాజకీయాల్లో ఉన్నా, ఈ రాష్ట్రాన్ని పాలించినా ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయ వేదికలను పంచుకోవడం సైతం అంతంత మాత్రమే. అటువంటి ఆమెపై తెలుగుదేశం పార్టీ కీలక బాధ్యతలు పెట్టింది. ఆమెను ముందుంచి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ఆమెకు పెద్ద బాధ్యతే.
ఎన్టీఆర్ కుమార్తెలలో రాజకీయాల్లో ఉన్నది ఒక్క పురందేశ్వరే. మంచి వాగ్దాటి, సమకాలీన రాజకీయ అంశాలపై సమగ్ర అవగాహన వంటి వాటితో ఆమె పొలిటికల్ గా బాగానే రాణించారు. కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ స్థాయిలో భువనేశ్వరి రాణించగలరా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పురందేశ్వరి తో పోలిస్తే భువనేశ్వరికి ప్రసంగ సామర్థ్యం తక్కువ. చంద్రబాబు అరెస్టుతో సానుభూతి ఉన్నా.. దానిని వర్కౌట్ చేసేలా ప్రసంగాలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత పలు సందర్భాల్లో మీడియాతో భువనేశ్వరి మాట్లాడారు. భర్త జైలులో ఉన్నా ధైర్యంగానే మాట్లాడగలిగారు. అయితే పార్టీ శ్రేణులకు ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబు రాజకీయాల్లో ఉండగా హెరిటేజ్ సంస్థను ఏర్పాటు చేశారు. చంద్రబాబు బిజీగా మారిపోవడంతో ఆ బాధ్యతను భువనేశ్వరి తన భుజస్కందాలపై పెట్టుకొని విజయవంతంగా నడిపించగలిగారు. హెరిటేజ్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం వెనుక ఆమె కృషి ఉంది. అటు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను సైతం నడిపిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదంతా తెర వెనుక. ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి వారిని ఆలోచింప చేయాలి. ఒకవైపు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొంటారోనన్న అనుమానం మాత్రం ఉంది.
త్వరలో భువనేశ్వరి సంఘీభావ యాత్రను ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలను చూసి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఆయా జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో సైతం పాల్గొంటారు. ఇటు కేడర్ కి ఉత్సాహం ఇస్తూనే.. అటు జనంతోనే టీడీపీకి కొత్త బంధం వేయడానికి ప్రయత్నించాల్సిన గురుతర బాధ్యత భువనేశ్వరి పై ఉంది. ముఖ్యంగా అధికార వైసీపీని టార్గెట్ చేసుకోవాలి. నిప్పులు చెరగాలి. పార్టీ శ్రేణులకు భరోసా కల్పించాలి. ఏకకాలంలో ఇవన్నీ జరగాలి. అప్పుడే భువనేశ్వరి ఎంట్రీ సక్సెస్ అయ్యేది. అయితే ఎన్నడూ రాజకీయాల వైపు చూడని భువనేశ్వరి ఎంట్రీ కలిసి వస్తుందా? లేదా? అన్న ఆందోళన సగటు టిడిపి అభిమాని లో ఉంది.