Kotamreddy Srinivasulu Reddy: ఆయన వైసీపీకి వీరవిధేయుడు. వైఎస్ కుటుంబానికి అపరభక్తుడు. వైఎస్ఆర్ నుంచి జగన్ రెడ్డి వరకు వైఎస్ కుటుంబాన్ని నమ్మి వెంట నడిచారు. జగన్ కోసం అప్పట్లో మంత్రుల్నే ఎదురించి పనిచేశారు. వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ చివరకు ఆయనకు మిగిలిందేమిటి ?. సొంత పార్టీనే డేగకన్ను వేసింది. ఫోన్ ట్యాపింగ్ చేసింది. నీడలా వెంటాడింది. నమ్మి వెంట నడిచినందుకు ఆయనకు ఆవేదన మిగిలింది.

నెల్లూరు వైసీపీలో ముసలం పుట్టింది. ఒకవైపు ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్త పర్వం కొనసాగుతుండగానే .. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. నెల్లూరు వైసీపీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలకమైన వ్యక్తి. వైఎస్ కుటుంబం కోసం కాంగ్రెస్ ను ఎదురించి నెల్లూరులో రాజకీయం చేశారు. జగన్ పార్టీ పెట్టక ముందు నుంచి జగన్ వెంట నడిచారు. అలాంటి వ్యక్తి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇది వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్టానం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని కోటంరెడ్డి ఆరోపణలు చేశారు.
కోటంరెడ్డి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నించింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వైసీపీ రంగంలోకి దించింది. కోటంరెడ్డి బ్రదర్స్ తో బాలినేని చర్చలు జరిపారు. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోటంరెడ్డి బ్రదర్స్ ఇప్పటికే టీడీపీతో మాట్లాడుకున్నారని తేల్చిచెప్పారు. వైసీపీని వీడాలనుకున్నప్పుడు వెళ్లిపోవచ్చని అన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు. సీఎం జగన్ తో మాట్లాడిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్చార్జీని నియమిస్తామని తెలిపారు.

కోటంరెడ్డి కార్యాలయం వద్ద కొత్త ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో కోటంరెడ్డి బ్రదర్స్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. జగన్, వైసీపీ నేతల ఫోటోలు లేవు. మీరు ఏ పార్టీలో ఉన్నా.. మీ వెంటే ఉంటాం అంటూ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మొత్తం వ్యవహారం జగన్ వద్దకు చేరనుంది. జగన్ తో చర్చల అనంతరం కోటంరెడ్డి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెడతారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీలో కీలకంగా ఉన్న ఆనం విజయకుమార్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్చార్జీగా నియమించే అవకాశం ఉంది.
కోటంరెడ్డి అసంతృప్తి వెనుక చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పనులు సరిగా కావడం లేదంటూ మంత్రి కాకాణి సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాట వినడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు కానీ పనులు కావడం లేదంటూ ఆరోపించారు. గతంలో సమస్యల పరిష్కారం కోసం డ్రైనేజీల్లోకి దిగి నిరసన తెలిపారు. అదే సమయంలో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని కోటంరెడ్డి ఆశించారు. కానీ దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. వీటికి తోడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కోటంరెడ్డిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీని వీడాలని కోటంరెడ్డి బ్రదర్స్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి వైసీపీ అధిష్టానం బుజ్జంగిపులకు తలొగ్గుతారా ? లేదా పార్టీ మారతారా ? అన్నది వేచిచూడాలి.