ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న కీలక అంశాల్లో.. కొందరు వైసీపీ నేతల వ్యవహార శైలి కూడా ఉంది. వీళ్లు సీక్రెట్ గా ఢిల్లీ వెళ్లి.. బీజేపీ నేతలను కలిసి, మళ్లీ అంతే సీక్రెట్ గా రాష్ట్రానికి రావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు మరికొందరు మంత్రులను కలిసి వచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి వైసీపీ ఎంపీలు అందరూ ఢిల్లీలోనే ఉన్నారు. మరి, ఇలాంటి సమయంలో రఘుపతి ఒక్కరే కిషన్ రెడ్డిని కలవడంలో ఆంతర్యం ఏంటనే చర్చ సాగుతోంది. నిజంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన అంశం మాట్లాడడానికే వెళ్లి ఉంటే.. అక్కడే ఉన్న ఎంపీలను కూడా తీసుకెళ్లాలి కదా? అనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. అంతేకాకుండా.. ఆయన కేంద్ర మంత్రిని కలిసిన విషయం కూడా ఎవ్వరికీ తెలియనివ్వలేదు. కిషన్ రెడ్డి పీ ఆర్ టీమ్ ఫొటోను రిలీజ్ చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది. లేదంటే.. సీక్రెట్ గానే ఉండేది.
ఈయన మాత్రమే కాకుండా.. మరికొందరు నేతలు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ మధ్య మంత్రి బొత్స కూడా ఇలాగే ఢిల్లీ వెళ్లి, కలవాల్సిన వారందరినీ కలిసి వస్తున్నట్టుగా చెబుతున్నారు. మీడియా కూడా తెలియకుండా వెళ్లి రావాల్సిన అవసరం ఏంటన్నది ఇక్కడ చర్చ. వైసీపీలోనూ ఈ తరహా చర్చ సాగుతోందని అంటున్నారు.
మరి, ఇలా వీళ్లందరూ సీక్రెట్ గా వెళ్లి, బీజేపీ నేతలను కలిసి రావడంలో ఆంతర్యం ఏంటనే ప్రశ్న అయితే వస్తోంది. పార్టీ అధిష్టానానికి తెలిసి వెళ్తున్నారా? సొంతంగానే వెళ్లివస్తున్నారా? అన్నది మరో డౌట్. బీజేపీ లీడర్లను కలవాల్సి వస్తే.. పార్టీ ఎంపీలతోనే వెళ్లి కలవాలని వైసీపీ హై కమాండ్ మొదట్లో నేతలకు నిర్దేశించింది. మరి, అది అమలవుతోందా? అనే సందేహం కూడా ఉంది. ఇవన్నీ.. కాకతాళీయంగా జరిగితే సరే. లేదంటే.. మాత్రం లెక్కలు మారిపోవడం ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి, దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.