Srikakulam MP Seat: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం హాట్ సీటే. గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీకి ఈ లోక్సభ స్థానం పట్టు చిక్కలేదు. అందుకే ఈసారి ప్రత్యేక వ్యూహం పన్నుతోంది. కానీ అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇక్కడ ఎంపీ ఆశావహులుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వైద్యులు ఉన్నారు. ఇద్దరికీ జిల్లా కీలక నాయకుల సపోర్ట్ ఉంది. దీంతో అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. ఒకరికి టికెట్ ఇస్తే.. మరో వర్గం సహకరిస్తుందా? లేదా? అన్న అనుమానం వెంటాడుతుంది.
2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెడ్డి శాంతి పోటీ చేశారు. ఆమెపై భారీ మెజారిటీతో ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. జగన్ ప్రభంజనంలో సైతం రామ్మోహన్ నాయుడు ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంటరీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ఐదింట ఓటమి చవిచూసినా.. టిడిపి ఎంపీ అభ్యర్థి మాత్రం గెలుపొందారు. రామ్మోహన్ నాయుడుకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ తోనే ఇది సాధ్యమైందన్న కామెంట్స్ అప్పట్లో వినిపించాయి.అందుకే వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలోదించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.
వైసీపీ టికెట్ కోసం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, డాక్టర్ దానేటి శ్రీధర్ ప్రయత్నిస్తున్నారు. 2009 ఎన్నికల్లో దివంగత ఎర్రం నాయుడు ను కృపారాణి ఓడించారు. కేంద్ర మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. అటు దానేటి శ్రీధర్ ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇద్దరూ బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇందులో కృపారాణి కి తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాసు మద్దతు పలుకుతున్నారు. దానేటి శ్రీధర్ కు మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రోత్సాహం ఉంది. మంత్రి ప్రసాదరావుకు కృపారాణి అంటే పడదు. అందుకే ఆమెను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు వైద్యుల మధ్య టికెట్ కోసం పోరు నడుస్తోంది. ఇద్దరికీ జిల్లా కీలక నేతల సపోర్ట్ ఉండటంతో హై కామెంట్ డిఫెన్స్ లో పడింది. ఆచీతూచీ అడుగులు వేస్తోంది.