
Nara Lokesh Padayatra- YCP: వైసీపీలో ఏది చేసినా అతిగానే ఉంటుంది. ఆ పార్టీ నేతలు తాముచేసింది చెప్పరు కానీ.. ప్రత్యర్థుల బలం, బలహీనతలపైనే ఎక్కువగా దృష్టిపెడతారు. వారిని మానసికంగా ఇబ్బందిపెట్టి పైశాచిక ఆనందం పొందుతారు. గ్రామస్థాయి నాయకుడి నుంచి సీఎం దాకా అదే పంథా. అయితే ఒకరోజు, రెండు రోజులు అయితే తెలియదు కానీ.. పార్టీ ఆవిర్భావం నుంచి అదే తెలివితేటలు ప్రదర్శిస్తుండడంతో ప్రజలు ఇప్పుడు వాస్తవాలను ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఆ పార్టీ సోషల్ మీడియా, చివరకు అనుకూల మీడియా చేసే ప్రచారం, అందులో చూపే అంశాలను రివర్స్ చేసుకొని వాస్తవాలను నిర్థారణ చేసుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్రపై చేస్తున్న ప్రచారంలో అసలు వాస్తవాలను పసిగట్టేస్తున్నారు.
Also Read: KCR- MIM: కేసీఆర్‌కు ఎంఐఎం పరీక్ష.. ‘అసద్’ దోస్తా.. దుష్మనా?
లోకేష్ పాదయాత్ర కోసం వైసీపీ సోషల్ మీడియాలో 1,200 మందిని రిక్రూట్ చేసినట్టు తెలుస్తోంది. సజ్జల కుమారుడు భార్గవ్ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇలా నియమించుకున్న సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు లోకేష్ పాదయాత్రను హైప్ చేస్తున్నారని సొంత పార్టీలో టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి లోకేష్ పాదయాత్రను టీడీపీ పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. ఆ పార్టీకి చెందిన కొద్దిమంది మాత్రం పనిచేస్తున్నారు. పలకరింపులు, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతోంది. ప్రభుత్వ ఆంక్షలతో సభలు, సమావేశాలు లేకుండా రోజువారి కార్యక్రమాలతో పాదయాత్ర కొనసాగుతోంది.
వందలాది మంది వైసీపీ సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు పాదయాత్రలోకి ప్రవేశిస్తున్నారు. పాదయాత్రను అనుసరిస్తున్నారు. టీడీపీకి జన సమీకరణకు శ్రమ లేకుండా చేస్తున్నారు.
విచిత్రంగా దొరికిపోయే ఫేక్ ఫోటోలు, వీడియోలతో హడావుడి చేస్తున్నారు.నెలల కిందట బైక్ ర్యాలీలో లోకేష్ పాల్గొన్న ఫొటోలు తెచ్చి.. పాదయాత్ర బైక్ యాత్ర అయిందని ప్రచారం చేస్తున్నారు. కొంత మంది సెలబ్రిటీ అకౌంట్లను మాట్లాడుకుని పోస్టింగులు, కామెంట్లు పెడుతున్నారు.వాటినే ట్రోల్ చేస్తున్నారు.
ఎక్కడో పదో అంతస్తు నుంచి పెద్దగా జనం లేని ఫొటోను పెట్టి ఇక్కడ లోకేష్ ఉన్నారా అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. లేనిపోని ప్రచారం చేసి లోకేష్ పాదయాత్రపై చర్చ జరిగేలా దోహదపడుతున్నారు. అయితే దీనిపై టీడీపీ సోషల్ మీడియా కూడా ధీటుగా స్పందిస్తోంది. వాస్తవం ఇది అంటూ ఆధారాలతో సహ సమాధానం చెబుతోంది. దీంతో ప్రజలు కూడా వైసీపీ చేస్తున్న పనిని ఏవగించుకుంటున్నారు. వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకుంటున్నారు.

లోకేష్ పాదయాత్రకు జనాదరణ లేనప్పుడు చిన్న గ్రామాల్లో సైతం ఆయన ప్రచారానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారన్న ప్రశ్న నేరుగా ప్రజల నుంచి వినిపిస్తోంది. మాట్లడడానికి మైక్ లేకుండా చేయడం కూడా ఏమిటన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అతి ప్రచారంతో ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతున్నాయి. అయితే వైసీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ మాత్రం దీనిని తప్పుపడుతున్నాయి. చేజేతులా లోకేష్ పాదయాత్రకు మనమే హైప్ చేస్తున్నామన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. కానీ హైకమాండ్ మాత్రం పట్టించుకోవడం లేదు.
