
KCR- MIM: తొమ్మిదేళ్లుగా తెలంగాణలో అధికార పార్టీకి మిత్రపక్షంగా కొనసాగుతున్న ఎంఐఎం ఎన్నికల ఏడాదిలో సీఎం కేసీఆర్‌కు పరీక్ష పెట్టబోతోందా.. ఎమ్మెల్సీ స్థానం కోసం ఆ పార్టీ అధికార పార్టీపై ఒత్తిడి తెస్తుందా.. పొత్తుపై అసదుద్దీన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం. అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఐదు రోజుల క్రితమే అసెంబ్లీలో అక్బరుద్దీన్ అధికార పార్టీతో వాగ్వాదానికి దిగారు. కేటీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ కూడా దీటుగా సమాధానం ఇచ్చారు. 7 సీట్ల పార్టీ అంటూ పదే పదే మంత్రి చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న అక్బర్.. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించారు. కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే అధికార పార్టీకి ఎంఐఎం సహకారం తప్పనిసరి. ఈ పరిస్థితి కేసీఆర్‌కు పరీక్షగా మారింది.
Also Read: MLA Vasantha Krishna Prasad: వైసీపీకి వసంత కూడా గుడ్ బై.. ఈ అసంతృప్తులకు అసలు కారణమేంటి?
అసద్ వరుస భేటీలు.. కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ మంత్రులు, బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావుతో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసమే బీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు అసద్‌ను చర్చలకు ఆహ్వానించారని తెలుస్తోంది. అయితే ఈ భేటీల అనంతరం మీడియాతో చిట్‌చాట్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు. ఇందుకు ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు. 50 స్థానాల్లో పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేశంలో బీజేపీని ఓడించాలని అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడం మంచి పరిణామమే అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ సభలకు మాకు ఆహ్వానం అందడం లేదని స్పష్టం చేశారు. కొత్త సచివాలయం తాజ్‌మహల్ కంటే పెద్దగా కట్టారని.. కొత్త సచివాలయం హైదరాబాద్‌కు తలమానికమే అని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్సీ స్థానం కోసం మజ్లిస్ పట్టు..
హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై మజ్లిస్ పార్టీ నజర్ పెట్టింది. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఉన్నారు. ఫిబ్రవరి 29తో గడువు ముగుస్తోంది. అయితే మరోసారి ఈ స్థానంలో ఎంఐఎంకే కావాలని పట్టుపడుతోంది. దీని కోసం బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత అసదుద్దీన్, అక్బరుద్దీన్ బీఆర్‌ఎస్ నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మిత్రపక్షమా.. శత్రుపక్షమా..
తాజా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మరో క్లిష్ట పరిస్థితి ఎదురుకాబోతోంది. సీఎం కేసీఆర్ ఎంఐఎం తమ మిత్ర పక్షమని అధికారికంగా ప్రకటించారు. అయితే ముఖ్యమైన మంత్రి కేటీఆర్ మాత్రం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తమకు ఎవరితో పొత్తు లేదని ప్రకటించారు. ఇదే సమయంలో అక్బరుద్దీన్‌ను పిచ్చోడు అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఎంఐఎం, బీఆర్‌ఎస్ ఒక్కటే అని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. మజ్లిస్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని విమర్శిస్తోంది. ఒకవర్గం ఓట్ల కోసం హిందువులను కేసీఆర్ కించపరుస్తున్నారని ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఎంఐఎంకు మద్దతు ఇస్తే బీజేపీ ప్రచారం నిజమే అవుతుంది. అదే సమయంలో మద్దతు ఇవ్వకుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం రూపంలో మరో ప్రతిపక్షం తయారవుతుంది. అక్బర్ చెప్పినట్లు 50 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తే బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయంపై తప్పక ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందా ? లేదా ? అనేది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీకి కూడా కార్పొరేటర్లు ఉండటంతో ఆ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది.
Also Read: Mahasena Rajesh: మహాసేన రాజేశ్ పార్టీ మార్పు వార్తల్లో నిజమెంత?
