Perni Nani vs Balashowry: మాజీ మంత్రి పేర్ని నానికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయా? ఆయనకు మంత్రి పదవి ఊడిపోయిన వెంటనే కొందరు నాయకులు, కార్యకర్తలు ముఖం చాటేశారా? వారంతా ఎంపీ వల్లభనేని బాలశౌరి వెంట నడిచిరా? అది నానికి మింగుడు పడడం లేదా? మొన్నటి మచిలిపట్నం ఎపిసోడ్ కు అదే కారణమా? అంటే అవననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బాలశౌరి, పేర్ని నానిల మధ్య విభేదాలు ఎటు దారితీస్తాయోనన్న చర్చ అధికార పార్టీలో నడుస్తోంది. అయితే ఈ అంశంపై అధిష్టానం సీరియస్ గా ద్రుష్టిసారించింది. ఇద్దరికీ స్పష్టమైన హెచ్చరికలు పంపినట్టు తెలిసింది. దీంతో నేతలిద్దరూ సైలెంట్ అయిపోయారు. మచిలీపట్నంలో 33వ డివిజన్ కార్పొరేటర్ అజ్ఘర్ అలీ.. ఎంపీ పర్యటనను అడ్డుకోవడం సమంజనం కాదనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే పేర్ని నానీకి అనుచరులుగా ఉన్న కొంతమంది ఇటీవల వివిధ కారణాలతో ఎంపీ బాలశౌరి వర్గీయులుగా మారారు. ఇలాంటి వలసలు ఇటీవల అధికమయ్యాయి. పేర్ని నాని కదలికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎంపీ కార్యాలయానికి చేరవేయడంతో పాటు మరికొంతమందిని ఎంపీ వద్దకు తీసుకెళ్లే కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. మంత్రి పదవిని కోల్పోయిన అనంతరం ఈ విషయాలను గమనించిన పేర్ని అదును కోసం చూసి ఈ గొడవకు తెరలేపారని తెలుస్తోంది. ఎంపీ అనుచరగణం మాత్రం ఈ అంశాన్ని తీవ్ర తప్పుగా పరిగణిస్తోంది.
పేర్ని నానీకి తెలియకుండానే జరిగిందా?
ఎంపీ బాలశౌరిని అడ్డుకున్న వ్యవహారం పేర్ని నానీకి తెలియకుండానే జరిగిందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. అజ్ఘర్ పరుష పదజాలం వాడటం, అడ్డుకున్న పోలీసులను సైతం తోసేయడం, ఎంపీ డౌన్‌డౌన్.. అంటూ నినాదాలు చేయడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందా.. అనే చర్చ నడుస్తోంది. పేర్ని నాని కుమారుడు కిట్టూ ఇటీవల పలు రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కార్పొరేటర్ అజ్ఘర్ అలీ, కిట్టూ స్నేహితులు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు రాజకీయాల్లో జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆధిపత్య పోరుకు తెరలేపారా? అనే అంశంపై చర్చించుకుంటున్నారు. పైగా ఓ కార్పొరేటర్.. ఎంపీని అడ్డుకున్న విషయంపై పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న పేర్ని నాని ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంపై తరువాత మాట్లాడతానని చెప్పడం గమనార్హం.
Also Read: Eight Years of Modi Govt: ఎనిమిదేళ్ల మోడీ పాలన ఎలా వుంది ?
స్పందించని బాలశౌరి
ఎంపీ వల్లభనేని బాలశౌరి సైతం ఉన్నట్టుండి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మచిలీపట్నంలోని తన కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అందుబాటులో ఉంటారనే సమాచారం కార్యకర్తలు, నాయకులకు పంపారు. ఈ సమయంలో 33వ డివిజన్ సంఘటనపై ఎంపీ ఏం మాట్లాడతారనే అంశంపైనా ఉత్కంఠ ఏర్పడింది. మీడియా ప్రతినిధులంతా కార్యాలయానికి చేరుకున్నారు. కానీ, ఎంపీ బాలశౌరి ఏం మాట్లాడలేదు. మీకు, ఎమ్మెల్యే పేర్ని నానీకి మధ్య విభేదాల కారణంగానే కార్పొరేటర్ మిమ్మల్ని అడ్డుకున్నారా, దీనిపై మీ సమాధానమేంటని విలేకరులు పదేపదే ప్రశ్నించారు. అధిష్టానం నుంచి వచ్చిన సూచనలతోనే ఏం మాట్లాడట్లేదా అని అడగ్గా, దాటవేశారు. మరోవైపు మచిలీపట్నంలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలపై పార్టీ అధిష్టానం వివరాలు సేకరించింది. ఇద్దరూ కూర్చుని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ అంశాన్ని మరింత వివాదాస్పదం చేయొద్దని తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. చూడాలి విభేదాలు ఆగుతాయో.. లేక మరింత తీవ్రమవుతాయో..
Also Read: Nayanthara and Vignesh- TTD: విగ్నేష్-నయనతారలకు భారీ ఊరట… వివాదం నుండి బయటపడ్డ కొత్త జంట!