Power Crisis In AP: ఏపీలో విద్యుత్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. పల్లెల్లో కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. జెన్కో విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న కరెంటు చాలడం లేదు. ఏరోజుకారోజు బహిరంగ మార్కెట్లో కొనాల్సి వస్తోంది. అది కూడా సరిపడా కొనడం లేదు. కోతలని అధికారికంగా చెబితే విమర్శలు వస్తాయని.. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్‌కు ఈఎల్ ఆర్ పేరుతో ‘అంతరాయం’ కలిగిస్తూ.. డిస్కమ్‌లు రోజులు వెళ్లదీస్తున్నాయి. అయితే ఎంత కరెంటు.. ఎంతకు కొంటున్నారో బయటకు పొక్కనివ్వడం లేదు. విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉందని తెలిస్తే తీవ్ర విమర్శలు వస్తాయని దాచిపెడుతున్నాయి. అయితే ఆ బండారాన్ని కేంద్ర విద్యుత్ సంస్థ బట్టబయలు చేసింది.రాష్ట్రంలో రోజువారీగా ఎంత విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు.. ఎంత ధర చెల్లిస్తున్నారో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కమ్)లు రహస్యంగా ఉంచుతున్నాయి. ఎంత సేపూ రోజుకు 40 కోట్లు ఖర్చు పెట్టి బొగ్గు కొంటున్నామని.. బహిరంగ మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా కరెంటు కొనుగోలు చేస్తున్నామని చెప్పడం తప్ప అసలు వివరాలు దాచిపెడుతున్నాయి. అవి బయటపెడితే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని.. రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతలు అమలు చేస్తున్నామని అంగీకరించాల్సి ఉంటుంది. అయితే ఆ వివరాలను డిస్కమ్‌లు దాచినా కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) తన నివేదికలో బహిర్గతం చేసింది.
ఖర్చు చేసిందిలా..
మార్చి నుంచి మే దాకా మూడు నెలల్లో ఏకంగా రూ.1,037 కోట్లను వ్యయం చేసి 1,830.35 మిలియన్ యూనిట్ల కరెంటును రాష్ట్ర డిస్కమ్‌లు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. రోజువారీ విద్యుత్ కొనుగోలు.. సగటున ఒక్కో యూనిట్‌ను ఎంత ధరకు కొనుగోలు చేశాయో వివరించింది. మార్చి నెలలో ఏకంగా 1,000 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేశాయి. మార్చి 17న 44.4 మిలియన్ యూనిట్లను సగటున రూ.10.21 చొప్పున కొన్నాయి.
Also Read: Perni Nani vs Balashowry: బాలశౌరి, పేర్నినానిపై వైసీపీ హైకమాండ్ సీరియస్..అసలు జరిగిందేమిటి?
ఇందులోనే కొన్ని మిలియన్లకు యూనిట్‌కు రూ.20 దాకా చెల్లించాయి. మార్చి 23వ తేదీన 24.94 మిలియన్ యూనిట్లను సగటున రూ.15.78 చెల్లించి కొనుగోలు చేశాయి. ఇందులోనూ కొన్ని యూనిట్లకు రూ.25 దాకా చెల్లించింది. మర్నాడు 32 మిలియన్ యూనిట్లు రూ.16.52 చొప్పున.. మార్చి 25న 27 మిలియన్ యూనిట్లను సరాసరిన రూ.18.48 చెల్లించి కొనుగోలు చేసింది. ఏప్రిల్ నెలలో సగటున యూనిట్‌కు రూ.9.56 చొప్పున 503.93 మిలియన్ యూనిట్లు కొన్నాయి. మే నెలలో 338 మిలియన్ యూనిట్లను సగటున రూ.7.59 చెల్లించి కొనుగోలు చేశాయి. సీఈఏ వివరాలను చూస్తే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రస్థాయిలో ఉందని తేలిపోతోందని.. తమిళనాడు, తెలంగాణ కంటే అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఏ పూటకాపూట కొనుగోలు లేకపోతే.. రాష్ట్రంలో అంధకారం నెలకొంటుందని స్పష్టం చేస్తున్నారు.
సీఎం మడత పేచీ
అయితే విద్యుత్ కొనుగోలు విషయంలో సీఎం జగన్ మడత పెచీ గుర్తుకొస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. యూనిట్ రూ.6.40కు కొనడమే నేరమన్నట్లుగా ఊరూ వాడా గగ్గోలు పెట్టారు. కమీషన్ల కోసమే ఇంత ధర పెట్టి కొంటున్నారని విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు తన హయాంలో యూనిట్ రూ.18కి కొనుగోలు చేయడాన్ని సమర్థించుకుంటున్నారు. గతంలో విదేశీ బొగ్గు టన్నుకు రూ.4,600 చెల్లించి కొంటే తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.25,000 పెట్టి కొంటున్నారు. పైగా దీనిని చాలా గొప్పగా సమర్థించుకుంటున్నారు. రోజూ రూ.40 కోట్లు ఖర్చు చేసి బొగ్గును కొనుగోలు చేస్తున్నామని ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ వర్క్‌షా్‌పలో సీఎం చాలా ఘనంగా చెప్పారు. కానీ ఈ డబ్బంతా తిరిగి ప్రజల నుంచే ట్రూఅప్ చార్జీలు, ఇంధన సర్‌చార్జీ పేరిట వసూలు చేసే విషయాన్ని ఆయన గోప్యంగా ఉంచారు. జనంపై ఇంధన సర్‌చార్జీ భారాన్ని మోపబోమని విస్పష్టంగా ప్రకటించడం లేదు. వినియోగదారుల ముక్కుపిండి మరీ వసూలు చేసే ఈ వ్యయాల గురించి వారికి తెలియజెప్పాలన్న స్పృహ కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని నిపుణులు ఆక్షేపిస్తున్నారు.
Also Read:US Inflation.: అమెరికాలో 40 ఏళ్ల గరిష్టానికి పెరిగిన ద్రవ్యోల్భణం..