JanaSena: సాధారణంగా తీవ్రవాదులు ఆత్మాహుతి దళాలతో దాడులు చేస్తారు. వారితోనే తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. ప్రత్యర్థులను మట్టు పెడతారు. ఇప్పుడు ఏపీలో సైతం వైసిపి ఇదే తరహా ప్రయోగాన్ని రాజకీయ ప్రత్యర్థులపై సంధించడానికి సిద్ధపడుతోంది. ముఖ్యంగా జనసేనపై ప్రయోగించడానికి కసరత్తు చేస్తుంది. తద్వారా తెలుగుదేశం పార్టీతో పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనాలను పొందాలని చూస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఈ సరికొత్త ప్లాన్ ను రూపొందిస్తోంది.
తెలుగుదేశం పార్టీతో పవన్ పొత్తు ప్రకటన చేసిన తర్వాత.. జనసేనలో ప్రో వైసీపీ భావాలు కలిగిన నేతలు విభిన్నంగా స్పందించారు. అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఒకరిద్దరు నాయకులు పార్టీని వీడారు. ఇక సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వారు సైతం ఉన్నారు. పార్టీతో పాటు అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు ఉన్నారు. ఇటువంటి వారి విషయంలోనే జనసేన నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో ఆ తరహా ప్రకటనలు నిలిచిపోయాయి. లేకుంటే మాత్రం ఇప్పటికీ కొనసాగేవి. అయితే జనసేనలో ప్రోవైసిపీ భావాలు ఉన్న నేతలు ఒక్కొక్కరు బయటపడ్డారు. మరికొందరు వ్యూహాత్మక మౌనం పాటించారు.
ఇటువంటి తరుణంలోనే జనసేన పై భారీ కుట్ర జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. తొలుత జనసేనలో చేరడం. తరువాత పార్టీ టికెట్ను కోరడం. దొరికితే వైసిపికి అనుకూలంగా పనిచేయడం. దొరకకపోతే జనసేన తో పాటు పవన్ పై అనుచిత విమర్శలు చేసి బయటకు వెళ్లిపోవడం.. ఈ తరహా కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనలోకి వైసిపి కోవర్టులను పంపించేందుకు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ప్రత్యేక కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో ఉభయగోదావరి జిల్లాలు కీలకం. అక్కడ చాలామంది నాయకులు ఆశావహులుగా ఉన్నారు. ఇప్పటివరకు వైసీపీ నాయకత్వంతో టచ్ లో ఉన్న నాయకులు సైతం జనసేన టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటివరకు వారు అధికారికంగా జనసేనలో చేరలేదు. కొద్ది రోజుల్లో చేరి టిక్కెట్ సంపాదించుకొనడానికి పావులు కదుపుతున్నారు. టికెట్ వస్తే సరే.. లేకుంటే జనసేనలో అంతర్గత కలహాలు తల పెట్టాలన్నది వారి అభిమతం. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుకుంటే ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పార్టీపై జరుగుతున్న కుట్రను ఆదిలోనే గుర్తించడం మంచిదని సూచిస్తున్నారు.