Homeఆంధ్రప్రదేశ్‌JanaSena Vs YCP: జనసేన పై మరో కుట్ర కోణం..

JanaSena Vs YCP: జనసేన పై మరో కుట్ర కోణం..

JanaSena Vs YCP: పవన్ ఊహించినట్టే జరుగుతోంది. పొత్తులు కుదిరాక జనసేన పై వైసిపి కుట్రకోణం బయటపడుతోంది. జనసేన లో ఉన్న ప్రోవైసిపీ నేతలు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టును చదువుతున్నారు. తాజాగా పసుపులేటి పద్మావతి అనే జనసేన నేతను పావుగా వాడుకున్నారు. ఆమె జనసేనకు రాజీనామా చేస్తూ పవన్ తో పాటు జనసేన పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ పేరును బయటపెట్టారు. రుక్మిణి అనే మహిళ చుట్టూ జనసేన రాజకీయాలు తిరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. తప్పుడు అర్ధాలు ధ్వనించేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రుక్మిణి అనే మహిళ జనసేనలో యాక్టివ్ గా ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆమె లండన్ లో వ్యాపారాలు నిర్వహిస్తుండేవారు. జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితులై 2020లో ఆమె పార్టీలో చేరారు. ఆ పార్టీ పొలిటికల్ అడ్వైజరి వైస్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. వీర మహిళ గా మంచి గుర్తింపు సాధించారు. పార్టీ కార్యాలయ నిర్వహణ బాధ్యతలను కూడా చూశారు. ఈ నేపథ్యంలో జనసేన ను వీడుతున్న ప్రోవైసిపీ నేతలు రుక్మిణిని తెరపైకి తేవడం విశేషం.ఒక పద్ధతి ప్రకారం జనసేన పార్టీని పలుచన చేసేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తుండడం విశేషం.

అయితే ఈ తరహా కుట్ర కోణాన్ని పవన్ ముందుగానే గుర్తించగలిగారు. ఆది నుంచి వైసీపీ విముక్తి ఏపీ లక్ష్యమని పవన్ ప్రకటించారు. వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని చెప్పుకొచ్చేవారు. ఇది జనసేన లోని ప్రొవైసీపీ నేతలకు నచ్చేది కాదు. అటు తాడేపల్లి ప్యాలెస్ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు అనుగుణంగా… టిడిపి తో పొత్తు వద్దు అని సదరు నేతలు జనసేన అధినేత పవన్ పై ఒత్తిడి తెచ్చేవారు. రకరకాల విశ్లేషణలను చెప్పి పొత్తు అంశం నుంచి తప్పించాలని భావించేవారు. అయితే వాటన్నింటిని పట్టించుకోని పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన చేయడం.. పొత్తుపై విఘాతం కలిగించే మాట్లాడిన వారిపై చర్యలకు ఉపక్రమించడంతో సదరు ప్రోవైసిపి నేతలకు ఝలక్ ఇచ్చినట్లైంది.

అయితే తాజాగా పసుపులేటి పద్మావతి అనే వీర మహిళ జనసేనకు రాజీనామా చేశారు. ఆమె క్రియాశీలకంగా ఎప్పుడు వ్యవహరించిన దాఖలాలు లేవు. జనసేన జెండాను మోసిన సందర్భాలు కూడా తక్కువే. అటువంటి ఆమె రాజీనామా చేస్తూ రుక్మిణి అనే తోటి మహిళా నాయకురాలి పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగారు. ఇప్పటికే పవన్ బహు భార్యత్వాన్ని వైసిపి టార్గెట్ చేసుకుంది. ఈ క్రమంలోనే రుక్మిణి కనుసన్నల్లో జనసేన పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయని ప్రచారానికి దిగడం సరికొత్త కుట్ర కోణం. దీనిని జనసేన పార్టీ శ్రేణులు లైట్ తీసుకుంటున్నాయి. అయితే దీనిపై గట్టి కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నాయి. కానీ తనపై వచ్చే వ్యక్తిగత విమర్శలు, సినిమా పరంగా చేసే ఆరోపణలపై స్పందించవద్దని పవన్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచించారు. అందుకే ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ పవన్ టార్గెట్ చేసుకుని వైసిపి చేస్తున్న కుట్రలను, కుతంత్రాలను గట్టిగానే అధిగమించాలని జనసేన వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version