Pawan Kalyan: నేనున్నానని… తెలుగు సినీ పరిశ్రమ కోసం ముందుకొచ్చిన పవన్

మహా న్యూస్ గ్రూప్ నుంచి.. మహా మ్యాక్స్ అనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ ఛానల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేశాయి.

Written By: Dharma, Updated On : October 24, 2023 5:07 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: సినీ రంగం నుంచి వచ్చిన పవన్.. ఒక విధంగా చెప్పాలంటే ఒంటరి పోరాటమే చేస్తున్నారు. ఆయనపై వచ్చే విమర్శలకు ఏనాడూ సినిమా రంగం వ్యక్తులు ఖండించిన దాఖలాలు లేవు. అంతకుమించి చెప్పాలంటే ఆయనపై విమర్శలకు ప్రత్యర్థులు సినీ రంగానికి చెందిన వ్యక్తులనే ప్రయోగిస్తుంటారు. కానీ ఏనాడు పవన్ సినీ రంగానికి పల్లెత్తు మాట అనలేదు. తనకు అండగా నిలవలేదని నిందించలేదు. తనపై ఉన్న కోపాన్ని ప్రభుత్వాలు పరిశ్రమపై రుద్దుతాయన్నది ఆయన భయం. అయితే తాజాగా పవన్ సినీ రంగం తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.

మహా న్యూస్ గ్రూప్ నుంచి.. మహా మ్యాక్స్ అనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ ఛానల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేశాయి. టీవీ ఛానళ్లు తమ టిఆర్పి రేటింగ్ పెంచుకునేందుకు సినీ రంగానికి చెందిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తమ వ్యక్తిగత జీవితాలను తెచ్చి టీవీ డిబేట్లు పెట్టుకునేంత పరిస్థితి వచ్చిందని వాపోయారు. అటువంటి పరిస్థితి మారాలన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సినిమా రంగం స్పందించాలన్న ఆలోచన సరికాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని కోరారు.

సినిమా రంగం లాగే.. మీడియా రంగానికి కూడా సెన్సార్ రావాలన్న పవన్ అభిప్రాయం వెనక లోతైన అభిప్రాయం ఉంది. ఇటీవల రాజకీయాల కోసం సినిమా రంగాన్ని వాడుకోవడం, ఇటు టిఆర్పి ల కోసం టీవీ ఛానళ్లు అతి చేయడం తెలిసిందే. టీవీ డిబేట్ లలో వివిధ రంగాల నిపుణులను, ప్రముఖులను కూర్చోబెట్టి సినీ రంగ వ్యక్తులపై జరుగుతున్న చర్చలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ విషయంలో తొలి బాధితుడు పవనే. కొన్ని ఛానళ్లు అయితే అదేపనిగా పవన్ పై విషప్రచారానికి దిగాయి. మరికొన్ని ఛానళ్లలో అయితే సినీ రంగానికి చెందిన మహిళల వ్యక్తిగత జీవితాలపై సైతం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మీడియాకు సైతం సెన్సార్ రావాలని బలంగా కోరుకున్నారు. మొత్తానికైతే తనకు సినీ పరిశ్రమ అండగా నిలవకపోయినా.. సినీ పరిశ్రమకు అండగా నిలిచేందుకు ముందు వరుసలో నిలబడ్డారు. దీనిని తెలుగు సినీ పరిశ్రమ ఆహ్వానిస్తోంది. పరోక్షంగా పవన్ కు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకోవడం విశేషం.