YCP: జగన్ సర్కార్ పిచ్చికి లెక్క లేకుండా పోతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం పై కొంతకాలం వివాదం నడిచింది. తరువాత న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో కొంత సర్దుకుంది. అటు ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. బడి,గుడి, ప్రభుత్వ భవనాలు, రక్షిత మంచినీటి పథకం ట్యాంకులు, చివరకు స్మశాన వాటికలను సైతం వదల్లేదు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా పార్టీ రంగులతో నింపేశారు. న్యాయస్థానాలు వద్దని చెప్పినా.. ఇంకా రంగులు పిచ్చి వదల్లేదు. తాజాగా కడప జిల్లాలో ఇటువంటి ఘటనే వెలుగు చూసింది.
పోరుమామిళ్లలో ఇటీవల ఆసుపత్రి భవనాలను నిర్మించారు. గతంలో 30 పడకల ఆసుపత్రిగా ఉండగా.. దానిని 50 పడకలుగా అప్ గ్రేడ్ చేశారు. కానీ వైసీపీ రంగులతో నింపేశారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఆసుపత్రిని వైసీపీ కార్యాలయం మాదిరిగా మార్చేశారు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పిచ్చి ఉండొచ్చు గానీ.. మరి ఇంతలా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం కొట్టి పారేస్తున్నారు. మా ప్రభుత్వం నిధులిచ్చింది కాబట్టి.. మా రంగులు వేసుకుంటామంటూ బదులిస్తున్నారు. అయితే దీనిని విపక్షాలు తప్పు పడుతున్నాయి.
వైసీపీ సర్కార్ రంగుల పిచ్చి పై న్యాయస్థానాలు చాలాసార్లు మొట్టికాయలు వేశాయి. కానీ ప్రభుత్వ తీరు మారలేదు. తొలుత పంచాయతీ కార్యాలయాలకు, తరువాత పాఠశాలలకు వైసీపీ రంగులను వేయడం తీవ్ర వివాదాస్పదమయ్యింది. చివరికి కోర్టు ఆదేశాలతో తొలగించాల్సి వచ్చింది. జగన్ సర్కార్
తీరుతో ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రభుత్వ వాహనాలకు, చివరకు చెత్తను తరలించే వాహనాలను కూడా విడిచిపెట్టలేదు. గత ఏడాది దేవి శరన్నవరాత్రి వేడుకల్లో సైతం.. విజయవాడ దుర్గమ్మ గుడి ప్రాంగణంలో వైసీపీ రంగుల తో కూడిన విద్యుత్ దీపాలను అలంకరించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే అధికారుల్లో ఎటువంటి చలనం లేకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా ఆసుపత్రిని వైసిపి కార్యాలయం మాదిరిగా రంగులతో నింపేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ దృశ్యాలే వైరల్ అవుతున్నాయి.