Rail Over Bridge: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సరికొత్త నిర్మాణం ఒకటి అందుబాటులోకి వచ్చింది. 2.2 కిలోమీటర్ల రైల్వే ఫ్లైఓవర్ నిర్మితమైంది. తిరుపతి జిల్లాలోని గూడూరు, నెల్లూరు జిల్లాలోని మనుబోలు రైల్వే స్టేషన్ మధ్య నూతనంగా ఈ వంతెన ను నిర్మించారు. శుక్రవారం నుంచి దీనిపై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.దీంతో విజయవాడ- రేణిగుంట, చెన్నై- విజయవాడ మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్ల రాకపోకలు సాగించేందుకు ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుంది.
విజయవాడ -గూడూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. 3240 కోట్ల రూపాయలతో మూడో లైన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అందులో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వంతెనను నిర్మించారు. 32.5 టన్నుల యాక్సిల్ లోడుతో రైళ్లు సజావుగా నడిపేలా దీని నిర్మాణం చేపట్టారు. గూడూరు రైల్వే జంక్షన్ కావడంతోరైళ్ల రాకపోకలు అధికంగా ఉంటాయి.ఈ తరుణంలోనే ఇక్కడ ఫ్లైఓవర్ను నిర్మించారు.
గతంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 40 మీటర్ల పొడవైన వంతెన మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా 2.2 కిలోమీటర్ల ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం విశేషం. రైల్ వికాస్ నిగం లిమిటెడ్ అధికారులు పనులు పూర్తి చేయడంలో చొరవ చూపారు. అనుకున్న లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయగలిగారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు.