TDP vs YCP: టీడీపీ అధినేత చంద్రబాబును బండబూతులతో మానసిక స్థైర్యం దెబ్బతీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార వైసీపీ ఇప్పుడు టీడీపీ ముఖ్యనేతలపై పడింది. సీనియర్ నేతలను వేటాడుతోంది. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై నోరుపారేసుకున్న పాపానికి ముచ్చటగా ఐదోసారి అర్థరాత్రి పూట ఆ టీడీపీ ముఖ్యనేతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టేశారు.

ప్రభుత్వ మాజీ విప్, టీడీపీ ముఖ్యనేత కూన రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. అర్థరాత్రి ఆయనను శ్రీకాకుళం జిల్లా శాంతినగర్ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో అదుపులోకి తీసుకొని పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో రవికుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అర్థరాత్రి సోదరి ఇంట్లో నిద్రిస్తుండగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు. శనివారం పది గంటల సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్యపై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన కోసం బయలుదేరిన సమయంలో హౌస్ అరెస్ట్ చేయగా.. పోలీసులపై కూన రవికుమార్ దురుసుగా వ్యవహరించారని.. టూటౌన్ సీఐ ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అర్థరాత్రి పూట రవికుమార్ ఇంటితోపాటు ఆయన సోదరుడు కూన సత్యంరావు ఇంటిపై కూడా పోలీసులు దాడులు చేశారు. అర్థరాత్రి వందల మంది పోలీసులతో ఇళ్లలోకి చొరబడి పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. టీడీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా వైసీపీ సర్కార్ ఉంది.