వైసీపీలో పాత కక్షలు పురివిప్పాయి. అవినీతిని ప్రశ్నించిన సొంత వైసీపీ కార్యకర్తనే వైసీపీ నేతలు చంపిన దారుణం చోటుచేసుకుంది. అనర్హులకు పెద్దపీట వేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి సొంత పార్టీ వైసీపీ నేతనే చంపేసిన వైనం విస్తుగొలుపుతోంది.
కడప జిల్లా కొండాపురం మండలంలోని పింజి అనంతపురంలో గల గండికోట ప్రాజెక్ట్ ముంపు పరిహారం విషయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. గండికోట ప్రాజెక్ట్ ముంపు పరిహారంలో అనర్హులు ఉన్నారంటూ గుర్నాథ్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ కోసం గ్రామసభ నిర్వహించగా.. వైసీపీకి చెందిన మరో వర్గం గుర్నాథ్ రెడ్డితో గొడవకు దిగింది. రాడ్లు, రాళ్లతో దాడు చేయడంతో గుర్నాత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్నాత్ రెడ్డి ప్రాణాలు వదిలాడు.
కడప జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు ఇటీవల ఎక్కువయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరులోనే ఈ కార్యకర్త దారుణహత్యకు గురవ్వడం సంచలనమైంది.. కొండాపురం మండలం పింజి అనంతపురంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన గురునాథ్ రెడ్డి మరణించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు కూడా మళ్లీ దాడులకు ముందుకు రావడంతో అక్కడ పరిస్థితి చేయిదాటేలా కనిపించింది.
వైసీపీ కార్యకర్త దారుణ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గ్రామాన్ని అదుపులోకి తీసుకొని పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎవరినీ ఇంట్లోంచి బయటకు రావద్దని సూచించారు.