Etela Rajender: బిజెపి సీనియర్ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హత్యకు కుట్ర జరిగిందా? భారత రాష్ట్ర సమితి నాయకులు కొంతమంది ఆయనను అంతమొందించేందుకు కుట్ర చేశారా? అందుకే కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించిందా? అంటే దీనికి అవును అనే సమాధానాలు వస్తున్నాయి. వాస్తవానికి నిన్నటి నుంచి రాష్ట్ర రాజకీయాలు హుజురాబాద్ నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. అంతకుముందు ఒకరోజు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వర్గం వారిని దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం, మరుసటి రోజు ఆ సామాజిక వర్గానికి చెందినవారు పాడి కౌశిక్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే నిన్న హఠాత్తుగా ఈటెల రాజేందర్ భార్య జమున విలేకరుల సమావేశం నిర్వహించారు. ” ప్రగతి భవన్ నుంచి ఒక పిచ్చి కుక్కను హుజురాబాద్ నియోజకవర్గంలోకి పంపారు. అతడు సైకో కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నాడు. నా భర్తను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. దీనికోసం 20 కోట్ల వరకు సుపారీ ఇచ్చినట్టు మాకు సమాచారం అందుతోంది. దీనిని గనక ఉపేక్షిస్తే ఈటల రాజేందర్ ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది” అని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం జరిగింది. రాజేందర్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో సాక్షాత్తు ఆయన సతీమణి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది జరిగిన కొద్దిసేపటికే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ మీద విరుచుకుపడ్డారు. మనుషులను చంపించే కుట్ర ఈటల రాజేందర్ దే అని ఆరోపించారు. ఉద్యమకారుల హత్యలకు, ఆత్మ హత్యలకు ఈటల రాజేందరే కారణమని ధ్వజమెత్తారు. తాను ఈటల రాజేందర్ హత్యకు కుట్ర పన్నలేదని స్పష్టం చేశారు. అంతేకాదు కేవలం సింపతి కోసమే ఈటెల రాజేందర్ ఇలాంటి డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. సింపతి రాజకీయాలు ఇకపై హుజురాబాద్ నియోజకవర్గం లో చెల్లవని ఆయన స్పష్టం చేశారు. అటు ఈటెల జమున, ఇటు పాడి కౌశిక్ రెడ్డి పోటాపోటీగా విలేకరుల సమావేశాలు నిర్వహించడంతో ఒకానొక దశలో హుజురాబాద్ నియోజకవర్గం లో ఏం జరుగుతుందో అంతుపట్టకుండా ఉంది.
ఈ సంఘటనలు జరిగిన తర్వాత ఈటెల రాజేందర్ షామీర్పేటలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తనకు ప్రాణభయం ఉందని, తనను అంతమొందించేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి లాంటి ఒక సైకో హుజురాబాద్ నియోజకవర్గం మీద పడి పశువులాగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ప్రగతి భవన్ నుంచే తన హత్యకు స్కెచ్ వేశారని, ఉద్యమ సమయంలోను తనకు ఇలాంటి బెదిరింపులు ఎదురయ్యాయని, ఇటువంటి చిల్లర వాటికి భయపడే జాతి తనది కాదని రాజేందర్ స్పష్టం చేశారు.. అయితే ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం క్షేత్రస్థాయిలో రాజేందర్ కు ప్రాణ హాని ఉన్నట్టు తెలియడంతో కేంద్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వై కేటగిరి భద్రత పెంచింది. మంగళవారం రాత్రి ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించింది. ఇప్పుడు ఈటల రాజేందర్ కు కూడా వై కేటగిరి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసింది. వై కేటగిరి ప్రకారం 8 ప్లస్ 8 సిబ్బందితో కేంద్రం ఆయనకు సెక్యూరిటీ ఇస్తుంది. ప్రస్తుతం 2 ప్లస్ 2 భద్రతకు ఇది అదనం. కాగా ఈటెల రాజేందర్ భార్య సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్రం హఠాత్తుగా ఈ భద్రత కల్పించడం విశేషం.
ఈటలకు రాష్ట్ర సెక్యూరిటీ
ఇక ఈటల రాజేందర్ కు కేంద్రం వై కేటగిరి స్థాయిలో భద్రత కల్పించిన నేపథ్యంలో.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈటెల రాజేందర్ భద్రతపై ఆరా తీశారు. ఇదే అంశంపై డిజిపి అంజని కుమార్ తో ఫోన్లో మాట్లాడారు. ఈటెల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో క్షేత్రస్థాయిలో వెరిఫై చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని సూచించారు. కేటీఆర్ సూచనల నేపథ్యంలో డిజిపి సమీక్ష నిర్వహించనున్నారు. భద్రత పెంపునకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకోనున్నారు.. కేటీఆర్ సూచనల మేరకు ఈటెల రాజేందర్ ఇంటికి సీనియర్ ఐపీఎస్ అధికారి వెళ్లారు. ఆయన భద్రతకు సంబంధించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈటెల రాజేందర్ తనకు ప్రాణహాని ఉందని ఆరోపణలు చేయడంతో.. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి సదరు అధికారి రాజేందర్ తో చర్చలు జరిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమే రాజేందర్ కు సెక్యూరిటీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ బిజెపిని ఆదేశించడం హుజరాబాద్ ఎమ్మెల్యే భద్రతపై ఒకింత ఉత్కంఠ నెలకొంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Y category security to etela rajender
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com