Trump- Joe Biden: ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా. కొన్నేళ్లుగా తన పరపతి నెలబెట్టుకుంటూ అగ్రరాజ్య హోదాను దక్కించుకుంటోంది. కానీ పాలకుల విధానాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గొర్లను తినేటోడు పోయి బర్లను తినేటోడు వచ్చిండన్నట్లు ట్రంప్ పైనే వ్యతిరేకత రావడంతో బైడెన్ కు పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు బైడెన్ ట్రంప్ కంటే హీనమైన రేటింగ్ ను పొందడం గమనార్హం. దీంతో అమెరికా భవితవ్యం ఏమిటని అందరిలో ఆలోచనలు వస్తున్నాయి. అన్ని దేశాలు అమెరికాను నమ్ముకునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ఏ ఇలా దిగజారిపోవడంతో ఏం చేయాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

జో బైడెన్ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. దీంతో దేశం పురోగమనంలో పయనించాల్సింది పోయి తిరోగమనంలో నడుస్తోంది. దీంతో బైడెన్ రేటింగ్ 36 కు పడిపోవడం గమనార్హం. గతంలో ట్రంప్ కు 37 శాతం వస్తేనే దారుణమని చెప్పడంతో ఇప్పుడు బైడెన్ పరిస్థితి ఏంటనే వాదనలు కూడా వస్తున్నాయి. దేశాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించాల్సిన బైడెన్ ఏమి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ ఆర్థిక వ్యవస్థను దారిలో పెడతారా? లేక ఇంకా దారిద్ర్యంలోకే నెడతారా? అనేదే సందేహం.
చైనా కూడా మరోవైపు అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కరోనా సమయంలో కకావికలం అయినా తన స్థాయిని మాత్రం తగ్గించుకోవడం లేదు. ఫలితంగా అమెరికాకు కంటగింపుగా మారుతోంది. ఈ క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న సందర్భంలో చైనా గోతికాడి నక్కలా వేచి చూస్తున్నందున అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. జో బైడెన్ తీరుతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఏదో చేస్తారని ఆశించినా చివరకు నిరాశే మిగిలింది.

భవిష్యత్ లో అమెరికా తిరిగి పుంజుకుంటుందా? చైనాకు ఆధిపత్యం కట్టబెడుతుందా అనేది అనుమానమే. ఈ పరిస్థితుల్లో జో బైడెన్ ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కబెడతారు? ఆర్థిక మాంద్యం నుంచి ఎలా తప్పించుకుంటారు? కష్టాల కడలి నుంచి గట్టెక్కిస్తారా? భారత్ తో స్నేహహస్తం కొనసాగిస్తున్నా పాకిస్తాన్ లాంటి దేశాలకు పరోక్షంగా సాయం చేస్తూ అమెరికా తన కపట బుద్ధిని ప్రదర్శిస్తోంది. చైనా కూడా తన కుట్రలతో అమెరికాను అధిగమించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.