Afghanistan Crisis : తాలిబ‌న్ల‌ను నిల‌దీస్తున్న మ‌హిళ‌లు!

భ‌య‌ప‌డుతూ బానిస‌త్వాన్ని అంగీక‌రించ‌డం అంటే.. బ‌తికినా చ‌చ్చిన‌ట్టే అన్నాడో ప్ర‌ముఖ విప్ల‌వ‌కారుడు. ఇప్పుడు ఆఫ్ఘ‌నిస్తాన్ లో ప‌రిస్థితి ఇలాగే ఉంది. తాలిబ‌న్ల‌కు భ‌య‌ప‌డి దేశ అధ్య‌క్షుడే పారిపోయాడు. సైన్యంతోపాటు ఇత‌ర ప్ర‌భుత్వ నేత‌లు తాలిబ‌న్ల‌కు పూర్తిగా లొంగిపోయారు. దేశంలోని మ‌గాళ్లంతా దేశం వ‌దిలి పారిపోయేందుకు దారులు వెతుకుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆఫ్ఘ‌న్ లో మ‌హిళా విప్ల‌వం పురుడు పోసుకుంది. రాతియుగం నాటి రాక్ష‌స చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ.. మ‌హిళ‌లు రోడ్ల‌మీదికి రావ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఇందులో సంచ‌ల‌నం ఏముందీ […]

Written By: Bhaskar, Updated On : August 19, 2021 3:07 pm
Follow us on

భ‌య‌ప‌డుతూ బానిస‌త్వాన్ని అంగీక‌రించ‌డం అంటే.. బ‌తికినా చ‌చ్చిన‌ట్టే అన్నాడో ప్ర‌ముఖ విప్ల‌వ‌కారుడు. ఇప్పుడు ఆఫ్ఘ‌నిస్తాన్ లో ప‌రిస్థితి ఇలాగే ఉంది. తాలిబ‌న్ల‌కు భ‌య‌ప‌డి దేశ అధ్య‌క్షుడే పారిపోయాడు. సైన్యంతోపాటు ఇత‌ర ప్ర‌భుత్వ నేత‌లు తాలిబ‌న్ల‌కు పూర్తిగా లొంగిపోయారు. దేశంలోని మ‌గాళ్లంతా దేశం వ‌దిలి పారిపోయేందుకు దారులు వెతుకుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆఫ్ఘ‌న్ లో మ‌హిళా విప్ల‌వం పురుడు పోసుకుంది. రాతియుగం నాటి రాక్ష‌స చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ.. మ‌హిళ‌లు రోడ్ల‌మీదికి రావ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఇందులో సంచ‌ల‌నం ఏముందీ అంటారేమో.. బ‌య‌ట ఎక్క‌డైనా సాధార‌ణం కావొచ్చు, కానీ.. ఆఫ్ఘ‌న్లో ఖ‌చ్చితంగా ఇది ఊహించ‌ని ఘ‌ట‌నే!

ఆఫ్ఘ‌న్లు ష‌రియా చ‌ట్టాన్ని ఆధారంగా చేసుకొని పాల‌న సాగిస్తారు. అంటే.. ఇది ఒక మ‌త చ‌ట్టం. ఇందులో రూల్స్ చూస్తే నివ్వెర పోవాల్సిందే. ప‌దేళ్లు దాటిన మ‌హిళ‌లు చ‌దువుకోకూడ‌దు. చ‌దువుకునే వారు కూడా మ‌త గ్రంథాల‌నే చ‌దువుకోవాలి. ఇక‌, ఆడ‌వాళ్లు ఉద్యోగాలు చేయ‌కూడదు. ఆ మాట‌కొస్తే.. ఇల్లుదాటి ఒంట‌రిగా బ‌య‌ట‌కు రాకూడ‌దు. వ‌చ్చినా.. మ‌గ‌వారి తోడు ఖ‌చ్చితంగా ఉండాలి. ఇలా బ‌య‌ట‌కు వ‌స్తే.. ఖ‌చ్చితంగా బుర‌ఖా ధ‌రించాలి. ఒంట్లోనీ ఏ భాగం కూడా బ‌య‌ట‌కు క‌నిపించ‌కూడ‌దు.

ఇక‌, మ‌హిళ ఏం చేయాలి మ‌రి? జీవితాంతం నాలుగు గోడల మధ్యనే ఉంటూ.. ఇంట్లో వాళ్ల‌కు వండిపెడుతూ, పిల్ల‌ల‌ను క‌నిపెడుతూ ఉండాల‌న్న‌మాట‌. ఇంత‌కంటే దారుణమైన జీవితం ఉంటుందా? మ‌హిళల ప‌రిస్థితి ఇలా ఉంటే.. త‌ప్పు చేసిన‌వారిపై నేర విచార‌ణ వంటిది ఏమీ ఉండ‌దు. క‌న్నుకు క‌న్ను.. పంటికి ప‌న్ను సిద్ధాంత‌మే. చిన్న చిన్న త‌ప్పులు చేసినా.. కాళ్లు, చెతులు న‌ర‌క‌డం.. త‌ల‌లు న‌ర‌క‌డం, బ‌హిరంగం ఉరితీయ‌డం వంటివి ఎన్నో ఉంటాయి.

1996లో ఆఫ్ఘ‌నిస్తాన్ ను ఆక్ర‌మించుకున్న తాలిబ‌న్లు.. 2001 వ‌ర‌కు ఇదే దారుణ‌మైన పాల‌న విధానాన్ని కొన‌సాగించారు. ఈ స‌మ‌యంలో ఆఫ్ఘ‌న్ పౌరులు, మ‌హిళ‌లు అనుభ‌వించిన కష్టాల‌ను చెప్ప‌డానికి న‌ర‌కం అనేది చాలా చిన్న మాట అవుతుంది. 2001లో అమెరికా ద‌న్నుతో ఏర్ప‌డిన ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. 20 ఏళ్ల‌పాటు ఈ స్వేచ్ఛ‌ను అనుభ‌వించారు. అలాంటిది ఇప్పుడు ఉన్న‌ట్టుండి కోల్పోయే ప‌రిస్థితి రావ‌డంతో.. త‌ట్టుకోలేక‌పోతున్నారు.

అందుకే.. చావును లెక్క చేయ‌కుండా రోడ్ల‌మీద‌కు వ‌చ్చి నిర‌స‌న తెలుపుతున్నారు మ‌హిళ‌లు. బుధ‌వారం దేశంలోని ప‌లు చోట్ల ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ.. తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ముఖాల‌కున్న బుర‌ఖా తొల‌గించి మ‌రీ ఆందోళ‌న నిర్వ‌హించారు. మ‌హిళ‌లు ఈ విధంగా నిర‌స‌న తెల‌ప‌డం అన్న‌ది గ‌తంలో ఎన్న‌డూ లేదు. ఈ ప‌రిణామాన్ని తాలిబ‌న్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. నిర‌స‌న తెలిపార‌న్న కార‌ణంతో ఇద్ద‌రిని కాల్చి చంపారు కూడా. మ‌రి, రాబోయే రోజుల్లో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొంటాయో చూడాలి.