రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షం స్థానాలు కొద్దిరోజులే ఉంటాయి. ఎప్పుడు అధికారంలో ఉంటామో.. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటామో తమకే తెలియకుండా ఉంటుంది రాజకీయ నాయకులకు. అలాంటప్పుడు అధికారంలోకి వచ్చాము కదా అని విర్రవీగితే మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా ఓ పార్టీకి ప్రభుత్వాన్ని నిలబెట్టే అవకాశం ఇచ్చినప్పుడు, ఆ పార్టీ ప్రజల కోసం పనిచేయాలి.. వారి అవసరాలు తీర్చాలి..
Also Read: రెడ్డి వర్సెస్ బీసీ.. టీపీసీసీ ఎవరికీ దక్కనుంది?
కానీ ఇటీవల జరిగిన పరిమాణాల్లో అధికార పార్టీలు ప్రజా పాలనను మర్చిపోయి ప్రతిపక్ష పార్టీలపై ద్రుష్టి పెట్టారు. ప్రశ్నించే పార్టీలు లేకుండా చేస్తే తమకు ఎదురుండదని అనుకున్నారు.. ప్రతిపక్షం లేకుంటే తమకు ఎదురుండదని భావించారు.. అయితే ప్రశ్నించే పార్టీల నాయకులు లేకపోతేనేం.. ప్రశ్నించే ప్రజలు తయారయ్యారు.. ప్రజలు నేరుగా ప్రశ్నించకున్నా.. తమ ఓటు ద్వారా అధికార పార్టీ స్వభావాన్ని తెలిపారు. ఈ విషయం ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిరూపితమైంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తరువాత 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నా.. 119 స్థానాలకు 60 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు బంగారు తెలంగాణను సాధించడం కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ఆ విషయం మరిచిన గులాబీ నేత ముందుగా ఆ 60 స్థానాల నుంచి 100 కు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. అంటే ఆ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. మొత్తంగా టీడీపీ నామారూపాల్లేకుండా చేశారు.
2019లో ఎన్నికల్లో 100 కు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అయినా కేసీఆర్ ఊరుకోలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఆఫర్లు ప్రకటించడంతో వెనక్కి తిరిగి చూడకుండా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక కొందరు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే వారు సస్పెన్షన్ కు గురికావడంతో అసెంబ్లీలోనూ ప్రశ్నించేవారు కరువయ్యారు.
Also Read: రాములమ్మ బీజేపీ నుంచి వెళ్లిపోవడానికి చంద్రబాబే కారణమట..!
ఇక తమకు ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్న టీఆర్ఎస్ కు ప్రజలే ప్రతిపక్షంగా మారారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించరని అనుకుంటున్న సమయంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ప్రజలు తమ ఓటు ద్వరా ప్రశ్నించే బీజేపీ పార్టీని తయారు చేశారు. అంతకుముందు జరిగిన ఏ ఎన్నికల్లోనైనా టీఆర్ఎస్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రజలకు అసహనం తెప్పించింది.
ముఖ్యంగా కరోనా సమయంలో ప్రభుత్వం సూచనలు ఇచ్చినప్పటికీ బాధితులకు ఎలాంటి సాయం అందించలేదు. రైతుబంధు పేరుతో రైతులను ఆకట్టుకుంటున్న ఎల్ఆర్ఎస్ విధానంతో విసిగిపోతున్నారు. అసలే కరోనా కాలంలో తీవ్రంగా నష్టపోయిన ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ పేరుతో వేలకు వేలు వసూలు చేయడం అసహనం కలిగించింది.
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన టీఆర్ఎస్ నాయకులందరినీ వరదసాయంపై స్థానిక ప్రజలు నిలదీశారు. కానీ ఈ విషయాన్ని కేసీఆర్ లైట్ గా తీసుకున్నారు. అయితే అదే దెబ్బ కొట్టింది. ప్రజలను తక్కువ అంచనా వేస్తే వారు వేసే ఓటుతో ఎంతటి ప్రభుత్వానికైనా చురకలు పెట్టడం ఖాయమని నిరూపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల బాగోగులపై ద్రుష్టి పెడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్