Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అంచనాలు పక్కాగా పసిగట్టే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారని గతంలోనే ఓ బాంబు పేల్చారు. దీంతో పార్టీ వర్గాల్లో దీనిపై పెద్ద చర్చ జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని కేసీఆర్ తెగేసి చెప్పినా పార్టీ వర్గాలు మాత్రం విశ్వసించడం లేదు. కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను పక్కదారి పట్టించే విధంగా ప్రణాళికలు వేయడంలో ఘనుడు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయడంలో ఆయనకు ఆయనే పోటీ. దీంతో రాష్ర్టంలో ఏం జరుగుతుందనే దానిపై అందరిలో ఒకటే ఉత్కంఠ రేగుతోంది.

పార్టీ సమావేశంలోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచన లేదని చెప్పినా వారిలో నమ్మకం కలగడం లేదు. మరోవైపు రేవంత్ రెడ్డి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని మరోమారు బాంబు పేల్చడంతో పార్టీ వర్గాల్లో కలకలం మొదలైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలంగాణకు కూడా ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీ నేతల్లో ముందస్తు భయం పట్టుకుంది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళితే బాగుండదనే వాదన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తనదైన శైలిలో ఆయన ఆలోచన విధానాన్ని చెబుతూనే ఉండటం గమనార్హం. గతంలో చేసిన విధంగానే ఈ సారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ఘాంటాపథంగా చెబుతున్నారు. దీంతో పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది.
కేసీఆర్ ఆలోచన ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆయన ఎంతటి ప్రమాదాన్నైనా లెక్క చేయకుండా ముందుకు వెళ్లడం అలవాటే. గతంలో అధికారంలో లేనప్పుడు కూడా పలుమార్లు రాజీనామాలు చేసి చాలెంజ్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం కూడా అలాంటి కార్యక్రమానికి బీజం వేస్తారో ఏమో అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.