2014 నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించింది లేదు. దాని మిత్ర పక్షాలే అంతో ఇంతో విజయాలు సాధిస్తున్నాయి. మరోవైపు చూస్తే.. కాంగ్రెస్ నాయకత్వ సమస్యతోనే కొట్టుమిట్టాడుతోంది. జాతీయ పార్టీకి అధ్యక్షుడు లేని పరిస్థితి. రాహుల్ అస్త్ర సన్యాసం చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు పరిస్థితి మరింతగా దిగజారిందే తప్ప.. మెరుగు పడింది లేదు. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సాధించింది ఏమీలేదు.
మోడీ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి రావడం ఒకెత్తయితే.. కరోనాను హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారనే విమర్శల నేపథ్యంలో యూపీఏకు అవకాశం అందివచ్చిందని అంటున్నారు. అయితే.. దాన్ని ఉపయోగించుకునే కెపాసిటీ కాంగ్రెస్ కు ఎంత ఉందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యతిరేక కూటమిని ఫామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల బెంగాల్లో మమత భారీ విజయం సాధించడం, తమిళనాట స్టాలిన్ తిరుగులేని విజయం సాధించడంతో యాంటీ బీజేపీ వింగ్ యాక్టివ్ అవుతుందని అంటున్నారు. అయితే.. యూపీఏ కాకుండా మూడో ప్రత్యామ్నాయం ఏర్పడితే.. మళ్లీ ఓట్లు చీలి అనుకున్న లక్ష్యం నెరవేరదనే ఆందోళన కూడా ఉంది.
అందువల్ల యూపీఏలోనే ప్రాంతీయ పార్టీలు చేరాల్సి ఉంది. ఇటు చూస్తే.. గడిచిన ఎనిమిదేళ్లలో కాంగ్రెస్ పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేకపోవడంతో.. ఆ పార్టీ పెద్దన్న పాత్రను ప్రాంతీయ పార్టీలు ఎంత మేర అంగీకరిస్తాయన్నది ప్రశ్న. తాజా ఫలితాలతో మమత లైమ్ లైట్లోకి వచ్చారు. అటు శరద్ పవార్ వంటి నేతలు కూడా చైర్మన్ స్థానానికి పోటీ పడుతున్నారు. మరి, వీరిలో ఒకరికి తన సీటు ఇవ్వడానికి సోనియా అంగీకరిస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ విధంగా ఎన్నో శేష ప్రశ్నలు ఉన్నచోట.. యూపీఏ మళ్లీ వికసిస్తుందా? అన్నది అతి పెద్ద ప్రశ్న.