Opposition: బీజేపీ వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చి దేశంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. పూర్తి మెజార్టీ ఉండటంతో ఆపార్టీ దేశ వ్యాప్తంగా అనేక సంస్కరణలు చేపడుతోంది. దీంతో సహజంగానే బీజేపీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తోంది. అయితే దీనిని విపక్ష పార్టీలు పెద్దగా క్యాష్ చేసుకోలేక చతికిలపడుతున్నాయి. దీంతో ముచ్చటగా మూడోసారి సైతం బీజేపీనే కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా బలహీనపడుతూ వస్తోంది. ఒకటి అర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం ఉండగా మిగతా చోట్ల బీజేపీ, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ క్రమంగా పట్టును కోల్పోతూ వస్తోంది. నరేంద్ర మోదీని ఢీకొట్టాంటే కాంగ్రెస్ ఒక్క దానివల్ల అయ్యే పరిస్థితులు ప్రస్తుతం లేవనే చెప్పొచ్చు.
దీంతో మరోసారి కాంగ్రెస్ యూపీఏ కూటమిగా జట్టుకట్టి బీజేపీని ఎదుర్కోవాలని భావిస్తోంది. అయితే కాంగ్రెస్ కంటే తామే పెద్ద పార్టీలమని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల అధినేతలు భావిస్తున్నారు. దీంతో ఈ పార్టీలు కాంగ్రెస్ తో జతకట్టేందుకు ఇష్టపడటం లేదు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఏకంగా తమదే అసలైన కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఈక్రమంలోనే ఆమె ఓ ఈశాన్య రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ తృణహూల్ ఎమ్మెల్యేలుగా మార్చివేశారు. ఎన్పీపీ నేత శరద్ పవర్ తో కలిసి ఇదే తరహా రాజకీయాలను మమతా బెనర్జీ చేస్తున్నారు. ప్రధాని పదవీపై ఆశలు పెట్టుకున్న దీదీ అసలు యూపీఏ అనేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
Also Read: వాళ్లతో ‘పంచాయితీ’.. జగన్ కు మంచిది కాదా?
ఆమ్ ఆద్మీ సైతం ఇలానే వ్యవహరిస్తోంది. ఢిల్లీలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. పంజాబ్ లోనూ తమ పార్టీ గెలిస్తే దేశ వ్యాప్తంగా తమకు క్రేజ్ వస్తుందని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఆయన కూడా ప్రధాని పదవీపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ కూటమిలో కలిసేందుకు ఇష్టపడటం లేదు. కామేడ్రు సైతం కాంగ్రెస్ కు అంటిముట్టనట్టుగానే ఉన్నారు.
మొత్తంగా విపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతుండటం బీజేపీకి కలిసి వచ్చేలా కన్పిస్తోంది. ఈ పార్టీలన్నీ కలిసినా మోదీని గద్దె దింపడం కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో విపక్ష పార్టీలన్నీ ఎవరికీ వారు పోటీలో నిలబడితే అది ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారడం ఖాయంగా కన్పిస్తుంది. ఇదే గనుక జరిగే విపక్ష పార్టీలన్నీ బీజేపీ నెత్తిన పాలుపోసినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల సీఎంలకు ముద్రగడ బహిరంగ లేఖ.. ఈసారి ఏం సంధించారంటే?