
దేశంలో కరోనా కేసుల సంఖ్య వాయువేగంతో పెరుగుతోంది. గత మార్చిలో ఎంత తీవ్రతతో అయితే కరోనా విజృంభించిందో ఇప్పుడే అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. దీన్ని భారత్ లో సెకండ్ వేవ్ మొదలైనట్టే కనిపిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది మార్చి కంటే ఎక్కువ కేసులు ప్రస్తుతం నమోదు అవుతుండడంతో ఆందోళన నెలకొంది.
దేశంలో రోజుకు 45-90 వేల మధ్యన కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారత్ లో 1.30 లక్షల మంది కరోనా బాధితులు చేరిపోయారు. మరణాల సంఖ్య దాదాపు 2 లక్షలకు చేరువైంది.
ఐరోపా దేశాల్లో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ స్ట్రాట్ అయ్యింది. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో లాక్ డౌన్ కూడా విధించారు. మిగతా దేశాల్లోనూ కఠిన నిబంధనలు పొందుపరిచారు. అయితే భారత్ లో మాత్రం కరోనా సెకండ్ వేవ్ కు కారణం తాజాగా జరుగుతున్న అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరో వైపు కరోనా వ్యాక్సిన్ రావడం.. 45 ఏళ్లపైన వారు వేసుకుంటుండడంతో ప్రజల్లో కరోనా భయం పూర్తిగా పోయింది. గతంలో మాదిరి శానిటైజర్ లను వాడటం లేదు. గత మార్చితో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో శానిటైజర్ల వినియోగం పదిశాతం కూడా లేదని గణాంకాలు చెబుతున్నాయి.
ఇక భౌతిక దూరం పాటించకపోవడం.. మాస్క్ లను ధరించకపోవడం వంటి కారణాలు కూడా కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నాయి. కేంద్రం అప్రమత్తమై ఏప్రిల్ 30 వరకు కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించినా జనాలు వాటిని పాటించే స్టేజ్ దాటిపోయింది.
ప్రస్తుత కేసుల తీవ్రత చూస్తుంటే మరో లాక్ డౌన్ దేశంలో తప్పదన్న చర్చ సాగుతోంది. వైద్యులు కూడా ఇదే అంటున్నారు. గతంలో కంటే రికవరీ పెరిగినా కూడా కరోనాతో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనాకు చికిత్స గతంలో కంటే మెరుగు అవ్వడం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని.. దీన్ని నియంత్రించాలంటే పాక్షిక లాక్ డౌన్ తప్పనిసరి అని అంటున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ఆ దిశగా అడుగులు వేయగా.. మరిన్ని రాష్ట్రాలు దేశం కూడా అదే బాటలో వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.