TDP Janasena Alliance: వచ్చే ఎన్నికల్లో పొత్తుల పై జనసేనాని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటి వరకు సీట్ల పంపకాల పై చర్చ జరగలేదని తేల్చి చెప్పారు. ఒంటరిగా వెళ్లడం కంటే ఉమ్మడిగా వెళ్లడమే మంచిదని జనసైనికులకు సూచించారు. అదే సమయంలో గౌరవప్రదమైన పొత్తులు ఉండాలంటూ పవన్ టీడీపీకి హింట్ ఇచ్చారు. పవన్ కోరుకుంటున్న గౌరవం టీడీపీ నుంచి దక్కుతుందా ? లేదా ? అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో బలంగా జరుగుతోంది.

రణస్థలం వేదికగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే అంశం పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల చంద్రబాబుతో భేటీ అంశం పై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలోని సమస్యల పై చర్చించినట్టు తెలిపారు. పొత్తుల అంశం చర్చకు రాకపోయినప్పటికీ భవిష్యత్తులో పొత్తు ఉండే అవకాశం ఉందని పవన్ చెప్పారు. అయితే ఆ పొత్తు గౌరవప్రదంగా ఉండాలని అన్నారు. పొత్తు అవసరమని చెబుతూనే .. తాను పొత్తుల కోసం వెంపర్లాడటం లేదని తేల్చి చెప్పారు. పొత్తు లేకపోతే ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధమని తేల్చిచెప్పారు.
పవన్ ప్రస్తావించిన గౌరవం అనే మాట ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. సీట్ల పంపకాలు, అధికార భాగస్వామ్యం విషయంలో జనసేనకు తగిన గౌరవం దక్కాలనేది జనసేనాని మాటల వెనుక అర్థంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీట్ల పంపకాలు తమ క్షేత్రస్థాయి బలానికి అనుగుణంగా ఉండాలని జనసేనాని భావిస్తున్నారు. సీట్ల పంపకాల అంశంలో పట్టు పెంచుకునే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. జనసేనతో టీడీపీ గౌరవంగా మెలగాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు.

గతంలో కంటే జనసేన క్షేత్రస్థాయిలో యాక్టివ్ అయింది. పెద్దఎత్తున ప్రభుత్వం పై పోరాడుతోంది. టీడీపీ పక్కకు నెట్టి పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రజల్లో కూడ జనసేనాని పై మంచి అభిప్రాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేనాని కింగ్ మేకర్ అవుతారని జనసేన నేతలు భావిస్తున్నారు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ సీట్లు పొత్తులో భాగంగా పొందాలని భావిస్తున్నారు. అలా జరిగితే జనసేన పాత్ర ప్రభావవంతంగా ఉంటుందని జనసేన నేతలు ఆలోచిస్తున్నారు. ఒకవేళ బీజేపీ తమతో కలిసి వస్తే కలుపుకుపోవాలని జనసేన, టీడీపీలు భావిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా సీట్ల పంపకాలు జరగాలని కోరుతున్నారు.