https://oktelugu.com/

CM Revanth Reddy: రేవంత్ తో స్నేహానికి జగన్ తహతహ

ఏపీలో సీఎం జగన్కు రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబు ఉన్నారు. కెసిఆర్ కు జగన్ సన్నిహితుడు. గత ఎన్నికల్లో జగన్కు సహకారం అందించారు. ఈ లెక్కన కెసిఆర్, జగన్కు చంద్రబాబు ఉమ్మడి శత్రువు.

Written By:
  • Dharma
  • , Updated On : December 9, 2023 / 04:07 PM IST

    CM Revanth Reddy

    Follow us on

    CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ తో ఏపీ సీఎం జగన్ సఖ్యతగా మెలుగుతారా? ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడతాయా? లేకుంటే ఒకరినొకరు ఇబ్బందులు పెట్టుకుంటారా? తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇన్ని రోజులు కేసీఆర్ తో జగన్ మంచి సంబంధాలే కొనసాగించారు. సన్నిహితంగా మెలిగారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే వీరిద్దరూ పెద్దపీట వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఏపీలో సీఎం జగన్కు రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబు ఉన్నారు. కెసిఆర్ కు జగన్ సన్నిహితుడు. గత ఎన్నికల్లో జగన్కు సహకారం అందించారు. ఈ లెక్కన కెసిఆర్, జగన్కు చంద్రబాబు ఉమ్మడి శత్రువు. అదే సమయంలో కెసిఆర్ తెలంగాణలో రేవంత్ రెడ్డిని నియంత్రించేందుకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అటువంటి సమయంలో జగన్ ఏనాడూ నిలువరించే ప్రయత్నం చేయలేదు. తాజా ఎన్నికల్లో సైతం సహకరించలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని బలంగా ఆకాంక్షించారు. అయితే అనూహ్యంగా రేవంత్ సీఎం కావడం జగన్ కు మింగుడు పడని విషయం.

    చంద్రబాబు శిష్యుడు రేవంత్ కావడమే జగన్ లో ఒక రకమైన భయానికి కారణం. కాంగ్రెస్ గెలుపునకు టిడిపి దోహద పడినట్లు.. ఏపీ ఎన్నికల్లో టిడిపి గెలుపునకు కాంగ్రెస్ పరంగా ఎక్కడ సహకారం అందిస్తారోనని జగన్ భయపడుతున్నారు. అందుకే రేవంత్ తో దోస్తీకి తహతహలాడుతున్నారు. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సోదర భావం, సహకారం ఫరిడవిల్లాలని జగన్ ఆకాంక్షించారు. జగన్ అభ్యర్థనపై రేవంత్ కూడా స్పందించారు. ” శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్ కి ధన్యవాదములు. సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీ అభివృద్ధికి సహకారం అందిస్తామని.. పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది” అంటూ కామెంట్స్ పెట్టారు. దీనిని వైసీపీ అనుకూల మీడియా.. తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.

    అయితే కెసిఆర్ తో సఖ్యతతో మెలిగిన జగన్.. ఆ స్థాయిలో రేవంత్ తో సన్నిహితంగా మెలగడం సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. అయితే జగన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా తెర వెనుక ప్రయత్నాలు చేస్తారన్నది ఒక అనుమానం. కానీ కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసిన జగన్ తో సయోధ్య విషయంలో రేవంత్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా కెసిఆర్ తనకు ఇబ్బంది పెట్టిన సమయంలో జగన్ ఒక రకమైన ఆనందంతో గడిపారు. మొన్నటి ఎన్నికల్లో తన మీడియా ద్వారా రేవంత్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ పరిణామాల దృష్ట్యా జగన్ తో స్నేహానికి రేవంత్ అవకాశం ఇవ్వరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.