దక్షిణ భాతదేశంలో ప్రగతిశీల ఆలోచనలకు, వ్యాపార దక్షతకు పేరెన్నికగన్న రాష్ర్టంగా ముద్ర పడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బలహీన రాష్ర్టంగా కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాల శృతి మించిన రాజకీయాలు కేంద్రం ముందు ఇద్దర్ని దోషిగా నిలుపుతున్నాయ. ఏపీ సీఎంకు ప్రధాని, హోంమంత్రి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటే ఏపీ పరిస్థితి ఏంటో అర్థమైపోతోంది. నిస్సహాయత, నిస్ర్పహ ఏర్పడుతున్నాయి. భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా మాట్లాడలేని దుస్థితి.
పోలవరం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం పచ్చి మోసమే. పునరావాసం ప్యాకేజీపై ఇంతవరకు స్పష్టత లేదు. ఆ మొత్తం రూ.30 వేల కోట్ల పైనే. వాటిపై కేంద్రం మాట మారుస్తోంది. ఇది పోలవరానికి గండి కొట్టడమే. తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలే కేంద్రానికి సాకుగా మారుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రత్యేక అథారిటీతో రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణలో టీడీపీ హయాంలోనే పనులు పూర్తి చేయాల్సింది. కాంట్రాక్టుల కమీషన్ల యావతో, పోలవరం ప్రాజెక్టు పనులు తన ఖాతాలోనే పడాలనే దురుద్దేశంతో చంద్రబాబు నిర్మాణ బాధ్యతలను తలకెత్తుకున్నారు. దీంతో నిధులు విడుదలలో జాప్యం జరిగింది. 2020 డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సిన పనులు నేటికి పూర్తి కాలేదు.
కరోనా తీవ్రత ఏపీలో ఎక్కువగానే ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో కరోనా వైరస్ విజృంబించిందంటే అక్కడి జనసమ్మర్థం ఉన్నందునే అని తెలుసుకోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాలున్న ఏపీలో కరోనా ఉధృతి పెరగడానికి కారణాలేంటి అంటే సమాధానం లేదు. హైదరాబాద్ లాంటి మహానగరమున్న తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివిటీరేటు జాతీయ స్థాయి కంటే ఎక్కువగానే ఉంది.
ఏపీలో వైద్య రంగమూ బెంబేలెత్తిపోతోంది. ఆనందయ్య తయారు చేసే నాటు మందు తమ రాజకీయాల్లోకి లాగేశారు. ఈ క్రెడిట్ అంతా తమకే దక్కాలని అధికార, ప్రతిపక్షపార్టీలు పావులు కదిపాయి. చివరికి అధికార పార్టీదే పైచేయి. దీన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షం పావులు కదుపుతోంది. ఆనందయ్య మందు విషయంలో ప్రభుత్వం జోక్యం ఉంటే సహించేది లేదని టీడీపీ ప్రకటించింది. ప్రజలకు ధైర్యం చెప్పి వారిలో రోగనిరోధక శక్తిని పెంచాల్సిన పార్టీలు తమ పెత్తనం కోసం తగవులాడుకుంటున్నాయి.